Begin typing your search above and press return to search.

పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో ట్రంప్ కయ్యం..

భారత్–అమెరికా మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ బంధానికి తాజాగా పగుళ్లు కనిపిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   2 Sept 2025 1:26 PM IST
పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో ట్రంప్ కయ్యం..
X

భారత్–అమెరికా మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ బంధానికి తాజాగా పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దేశాల సంబంధాలు క్రమంగా బలోపేతం అవుతూ వచ్చాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఈ బంధాన్ని దెబ్బతీస్తున్నాయి.

* భారత్‌పై సుంకాల భారాలు.. పాక్‌కు సడలింపులు

భారత్‌పై 50 శాతం సుంకాలు విధించగా.. పాకిస్తాన్‌కు కేవలం 19 శాతం మాత్రమే సుంకాలతో సరిపెట్టారు. ఈ చర్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపింది. రష్యా నుంచి చమురు కొనుగోలు, వాణిజ్య లోటు వంటి అంశాలు ఒక కారణమయినా.. భారత్–పాక్ సమస్యల్లో మధ్యవర్తిత్వం చేయాలన్న ట్రంప్ ప్రయత్నం విఫలమైన తర్వాత వ్యక్తిగత అసంతృప్తి కూడా కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* వ్యాపార ఒప్పందాలే కారణమా?

అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ప్రకారం.. ట్రంప్ కుటుంబం పాకిస్తాన్‌తో క్రిప్టో వ్యాపార ఒప్పందాల కోసం భారత్‌తో సంబంధాలను తాకట్టు పెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ట్రంప్ కుటుంబం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒప్పందం, అమెరికా–పాకిస్తాన్ మధ్య కొత్త సాన్నిహిత్యానికి దారితీసింది. అంతేకాక, పాకిస్తాన్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రయోజనాలపై ఆధారపడుతోందని బహిర్గతం చేస్తున్నాయి.

* భారత్–చైనా సమీపం వైపు

ట్రంప్ విధానాలు భారత్‌ను చైనాతో మళ్లీ సాన్నిహిత్యం వైపు నెడుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత చల్లబడిన భారత్–చైనా సంబంధాలు, తాజాగా ఎరువుల ఎగుమతులపై చైనా సడలింపులు ఇవ్వడం, వాణిజ్య సహకారం పెంపు సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలతో మెరుగవుతున్నాయి. ఇది అమెరికా వ్యూహపరమైన వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.

మిత్రబంధాలపై దెబ్బ

మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్యల ప్రకారం, ట్రంప్ సుంకాల విధానం దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు భారత్‌ను రష్యా, చైనా ప్రభావం నుంచి దూరం చేయాలన్న ప్రయత్నాలను వృథా చేసింది. భారత్‌తో బలమైన సంబంధాలు అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలకు అవసరమని, వాటిని బలహీనపరిచే విధంగా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

అమెరికా విశ్వసనీయతపై ప్రశ్నార్థకం

జర్మనీ, జపాన్, కెనడా వంటి మిత్రదేశాలు కూడా అమెరికా విధానాలపై సందేహంతోనే ఉన్నాయని సులివన్ పేర్కొన్నారు. సుంకాల విధానం అమెరికన్ వినియోగదారులపై భారం మోపడంతో పాటు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తంగా ట్రంప్ తాజా నిర్ణయాలు అమెరికా అంతర్జాతీయ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భారత్‌తో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ బంధానికి పగుళ్లు తీసుకొస్తున్నాయి. అమెరికాను పూర్తిగా నమ్మకూడదనే సందేశాన్ని ఇస్తున్నాయి.