Begin typing your search above and press return to search.

భారత్ కు ట్రంప్ బెదిరింపు.. 24 గంటలే టైం..

వాణిజ్య సంబంధాల అంశంలో భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రానున్న 24 గంటల్లో సుంకాలను మరింత పెంచబోతున్నట్లు హెచ్చరించారు.

By:  A.N.Kumar   |   5 Aug 2025 10:50 PM IST
భారత్ కు ట్రంప్ బెదిరింపు.. 24 గంటలే టైం..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సంబంధాల అంశంలో భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రానున్న 24 గంటల్లో సుంకాలను మరింత పెంచబోతున్నట్లు హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకోవడం, ఈ చర్యల ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు లభిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదన్న ట్రంప్

ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ "భారత్ మాతో పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తోంది. కానీ మేము మాత్రం వారికి అదే స్థాయిలో లాభాలు కల్పించడంలేదు. అందుకే 25 శాతం సుంకాలను విధించాం. ఇప్పుడు వాటిని మరింత పెంచబోతున్నాం" అని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలను తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో మళ్ళీ ఉద్ధృతంగా వెల్లడించారు. భారత్ చైనా, రష్యాలతో సంబంధాలు కొనసాగిస్తుండటంపై అమెరికా డెమొక్రాట్లు మాత్రమే కాదు, ట్రంప్ వంటి రిపబ్లికన్ నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

-భారత్ ఎదురుదాడి

చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే భారత్ తాను తగిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు అమెరికా లేదా యూరప్‌కు వ్యతిరేకంగా కాదని, అది పూర్తిగా జాతీయ ప్రయోజనాల మేరకేనని భారత్ వాదిస్తోంది. విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీ, అణుశక్తి రంగాల్లో అవసరమైన మూలపదార్థాలను కూడా రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోందని కౌంటర్ ఇచ్చింది..

- రష్యా మద్దతు.. అమెరికాపై మండిపాటు

ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా కూడా స్పందించింది. "ప్రతి సార్వభౌమ దేశానికి తాను ఎవరితో వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలన్నది తమ స్వతంత్ర నిర్ణయం. భారత్‌పై ఈ విధంగా ఒత్తిడి తెచ్చే హక్కు అమెరికాకు లేదు" అని రష్యా అధికారులు తెలిపారు.

- భవిష్యత్తు సంబంధాలపై అనిశ్చితి

ట్రంప్ 2024 తర్వాత కఠిన వాణిజ్య, విదేశాంగ విధానాలను ముందుకు తీసుకువస్తున్నారు.అయితే భారత్-అమెరికా సంబంధాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, ట్రంప్ లాంటి నేతల వ్యాఖ్యల వల్ల వాణిజ్య వాతావరణంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య భారత్ తన వాణిజ్య విధానాల్లో మార్పులు చేస్తుందా? లేక ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు సాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.