ట్రంప్ పాతిక, ఒక లక్షకు ఎసరు... మరి అమెరికాకు ఎంతో తెలుసా..?
భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 1 Aug 2025 12:45 PM ISTభారత దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే... ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారత్ లో కొన్ని రంగాలకు తీవ్ర ఇబ్బందని.. చాలా ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు. అయితే... ఈ సుంకాల మోత వల్ల భారత్ కే కాదు.. అమెరికా ప్రజలకు పెద్ద దెబ్బే అని అంటున్నారు నిపుణులు.
అవును... "మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం" అనే విషయం గ్రహించలేకపోయారో ఏమో కానీ... భారత ఉత్పత్తులపై 25% సుంకాలు విధించి, మురిసిపోతున్నట్లు కనిపిస్తున్న ట్రంప్.. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రజలు ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి ఆలోచించలేకపోయినట్లున్నారనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. అదేమిటో ఇప్పుడు చూద్దామ్...!
భారత్ కు నష్టం!:
తాజాగా ట్రంప్ తీసుకున్న 25% సుంకాల నిర్ణయం వల్ల భారత్ కు కొంత నష్టం ఉన్న మాట వాస్తవమే. ఇందులో భాగంగా... రత్నాభరణాల రంగంలో ఒక లక్ష ఉద్యోగాల వరకూ పోవొచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (ఏఐజీజేడీసీ) ఛైర్మన్ రాజేశ్ రోక్డే అంటున్నారు. ఈ ప్రభావం రాగి ఉత్పత్తులు, దుస్తుల ఎగుమతులతో పాటు ఫార్మా రంగం, సముద్ర ఆహర ఉత్పత్తులపైనా ఉండోచ్చని చెబుతున్నారు.
మరోవైపు అమెరికాకు ఎగుమతి చేసేవారు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... అమెరికా ఆర్డర్లను రద్దు చేసుకోవడం లేదా ప్రస్తుతానికి పక్కనపెట్టేయడం చేస్తున్నరని చెబుతున్నారు. పైగా... అదనంగా పెనాల్టీ కూడా అంటూ, అది ఎంతో చెప్పకపోవడం వల్ల కూడా ప్రస్తుతానికి ఎగుమతులను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎస్.సి. రల్హాన్ పేర్కొన్నారు.
అమెరికాకు కష్టం!:
మరోవైపు... ట్రంప్ తీసుకున్న భారత ఉత్పత్తులపై 25% సుంకాల నిర్ణయం వల్ల మన కంపెనీలకు జరిగే నష్టం కంటే, అమెరికా ప్రజలపైన పడే భారం అధికంగా ఉండనుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే ఔషదాల ధరలు పెరిగి అమెరికా ప్రజలపైనే అధిక భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి.
వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 30.47 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.65 లక్షల కోట్ల) విలువైన మందులు ఎగుమతి చేయగా.. అందులో మూడో వంతు అమెరికాకే చేరాయని చెబుతున్నారు. ట్రంప్ ఎంత అధికంగా సుంకాలు విధించినప్పటికీ.. మందులు కొనడం తప్పదు కాబట్టి... ఆ భారాన్ని అమెరికా ప్రజలే మోయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇది ఈ ఒక్క రంగం విషయంలోనే కాదని అంటున్నారు. భారత్ నుండి వచ్చే ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయని.. యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్యం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లు భారత్ కు ఉన్నాయని.. అందువల్ల ట్రంప్ సుంకాల నిర్ణయం భారతదేశంపై కంటే అమెరికాపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
