Begin typing your search above and press return to search.

అమెరికాను వీడండి.. రూ. 2.68 లక్షలు తీసుకోండి.. వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్

ఈ ఏడాది మే నెలలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఈ ప్రోత్సాహకాన్ని 1000 డాలర్లుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు దానిని ఏకంగా మూడువేల డాలర్లకు పెంచడం గమనార్హం.

By:  A.N.Kumar   |   23 Dec 2025 11:36 PM IST
అమెరికాను వీడండి.. రూ. 2.68 లక్షలు తీసుకోండి.. వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్
X

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం దూకుడు పెంచింది. కఠినమైన చర్యలతోపాటు స్వచ్ఛందంగా దేశాన్ని వీడే వారికి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్తే ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని స్టైఫండ్ గా భారీగా పెంచుతూ కీలకనిర్ణయం తీసుకుంది.

ఏమిటీ ఆఫర్?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అంగీకరిస్తే వారికి ప్రభుత్వం 3వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2.68 లక్షలు) చెల్లించనుంది. దీనికి అదనంగా ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. స్వదేశానికి వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో విధించిన జరిమానాల నుంచి మినహాయింపు లభిస్తుంది. స్వచ్ఛందంగా వెళ్లేవారిని అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రాలకు తరలించకుండా నేరుగా పంపిస్తారు.

గతంలో కంటే మూడు రెట్లు పెంపు

ఈ ఏడాది మే నెలలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఈ ప్రోత్సాహకాన్ని 1000 డాలర్లుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు దానిని ఏకంగా మూడువేల డాలర్లకు పెంచడం గమనార్హం. ఈ ‘హాలీడే ఆఫర్’ కేవలం ఈ ఏడాది చివరి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా అధికారులు వెల్లడించారు.

నమోదు చేసుకోవడం ఎలా?

స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలనుకునే వారు కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ (సీబీపీ హోమ్) యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఇలా చేసిన వారిని బలవంతంగా బహిష్కరించే జాబితా నుంచి తొలగిస్తారు.

ముంచుకొస్తున్న ముప్పు.. అధికారుల హెచ్చరిక

ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని వారిపై కఠినచర్యలు తప్పవని డీహెచ్ఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆఫర్ తిరస్కరించిన వారిని అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు. బలవంతంగా బహిష్కరణకు గురైన వారు భవిష్యత్తులో అమెరికాకు వచ్చే అవకాశం ఉండదు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడారు.

ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 1.5 లక్షల మందిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన ఈ భారీ నగదు ఆఫర్ ద్వారా మరిన్ని వేల మందిని స్వదేశాలకు పంపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.