Begin typing your search above and press return to search.

హోర్ముజ్ కోసం ట్రంప్ పిలుపు.. ఒక్క దేశం స్పందించలేదు.. పరువు పాయే..

’అందరూ రండి.. కలిసి హోర్ముజ్ జలసంధిని కాపాడదాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా పిలుపునిస్తే.. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా 'వినబడనట్లు' నటించడంలో ఒలింపిక్ రికార్డులు సృష్టించాయి.

By:  A.N.Kumar   |   18 March 2026 12:54 PM IST
హోర్ముజ్ కోసం ట్రంప్ పిలుపు.. ఒక్క దేశం స్పందించలేదు.. పరువు పాయే..
X

’అందరూ రండి.. కలిసి హోర్ముజ్ జలసంధిని కాపాడదాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా పిలుపునిస్తే.. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా 'వినబడనట్లు' నటించడంలో ఒలింపిక్ రికార్డులు సృష్టించాయి. ఇరాన్ పెడుతున్న ఇబ్బందుల నుంచి చమురు నౌకలను కాపాడేందుకు 'గ్యాంగ్' కడదామని ట్రంప్ ఆశపడితే మిత్రదేశాలన్నీ "మా ఇంట్లో పెళ్లి ఉంది", "మాకు తలనెప్పిగా ఉంది" అంటూ కుంటి సాకులు వెతుక్కుంటున్నాయి. చమురు మాత్రం అందరికీ కావాలి కానీ.. ఆ చమురు తెచ్చే దారిలో ఇరాన్ విసిరే 'మిస్సైల్స్' తగలకుండా అడ్డుపడమంటే మాత్రం అందరూ దౌత్యం అనే దుప్పటి కప్పుకుని పడుకున్నారు. ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి 'పెళ్లికి పిలిచారు కానీ.. భోజనానికి ఎవరూ రాలేదు' అన్నట్టుగా తయారైంది!

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే కీలక సముద్ర మార్గాలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రత ఇప్పుడు అంతర్జాతీయ చర్చనీయాంశమైంది. ఇరాన్ ఆంక్షలు.. నిర్బంధాల నేపథ్యంలో ఈ మార్గాన్ని సురక్షితం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు ప్రపంచ దేశాల నుండి ఆశించిన స్పందన లభించకపోవడం గమనార్హం.

భద్రతా సవాలుగా మారిన హోర్ముజ్

ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% వాటా కేవలం ఈ చిన్న జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఇరాన్ , ఒమన్ దేశాల మధ్య ఉండే ఈ మార్గం మూతపడినా లేదా అక్కడ నౌకలపై దాడులు జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ప్రస్తుతం ఇరాన్ అనుసరిస్తున్న కఠిన వైఖరి, పాక్షిక నిర్బంధాల వల్ల వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి జంకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సంయుక్త కార్యదళం ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.

సంప్రదింపులు జరిపినా.. సందిగ్ధంలోనే మిత్రదేశాలు

ఈ ఉమ్మడి భద్రతా చొరవ కోసం అమెరికా వర్గాలు చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ దేశాల నుండి వచ్చిన స్పందన మాత్రం అత్యంత జాగ్రత్తతో కూడుకున్నదిగా ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు సూత్రప్రాయంగా భద్రతను సమర్థించినప్పటికీ అమెరికా నాయకత్వంలో నేరుగా ఇరాన్‌తో ఘర్షణ పడేందుకు ఇష్టపడటం లేదు. జపాన్, దక్షిణ కొరియా తమ చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడ్డాయి. అయినప్పటికీ ఇరాన్‌తో తమకున్న దౌత్య సంబంధాలు దెబ్బతింటాయేమోనన్న భయంతో అవి ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన చైనా... అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు.

దేశాలు వెనుకంజ వేయడానికి ప్రధాన కారణాలు

చాలా దేశాలు ఈ ప్రతిపాదనలో చేరకపోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఇరాన్ తన ప్రాంతీయ జలాల్లో ఏ విధమైన విదేశీ సైనిక కదలికలనైనా తీవ్రంగా పరిగణిస్తుంది. ట్రంప్ చొరవలో చేరడం అంటే ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగడమేనని పలు దేశాలు భావిస్తున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలు.. విదేశాంగ విధానాల్లోని మార్పుల వల్ల, ఈ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనే సందేహాలు మిత్రదేశాల్లో ఉన్నాయి. సైనిక చర్య కంటే దౌత్యపరమైన చర్చల ద్వారా ఇరాన్‌ను ఒప్పించడం మేలని మెజారిటీ దేశాల అభిప్రాయం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

హోర్ముజ్ జలసంధిలో ఏ చిన్న అలజడి రేగినా.. అది కేవలం మధ్యప్రాచ్యానికి పరిమితం కాదు. భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా సముద్రపు రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారమయ్యే ప్రమాదం ఉంది. ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై స్టాక్ మార్కెట్లు పతనం కావడానికి కూడా ఇది దారితీయవచ్చు.

ప్రస్తుతానికి ట్రంప్ పిలుపు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రకంపన సృష్టించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలులోకి రావడానికి మరిన్ని దౌత్యపరమైన కసరత్తులు అవసరం. ప్రపంచ దేశాలు "వేచి చూసే ధోరణి" అవలంబిస్తుండటంతో రాబోయే రోజుల్లో హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్నది వేచి చూడాలి.