Begin typing your search above and press return to search.

ట్రంప్ కుంప‌టి: ఏంటీ హెచ్‌-1బీ వీసా? నిబంధ‌న‌లు ఎందుకు?

ఈ నెల 21 నుంచి దేశంలోకి ప్ర‌వేశించాల‌ని అనుకునే హెచ్‌-1బీ వీసాదారులు.. భార‌త క‌రెన్సీలో 89 ల‌క్ష‌ల రూపాయలు వెచ్చించాలి.

By:  Garuda Media   |   20 Sept 2025 3:46 PM IST
ట్రంప్ కుంప‌టి:  ఏంటీ హెచ్‌-1బీ వీసా?  నిబంధ‌న‌లు ఎందుకు?
X

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా-ఇజ్రాయెల్ యుద్ధం స‌హా.. ఉగ్ర‌వాద దాడులు.. ద‌క్షిణాఫ్రికాలో ఆక‌లి కేక‌లు వంటి అనేక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ సాగుతున్న త‌రుణంలో అనూ హ్యంగా అమెరికా అధ్య‌క్షుడు రాత్రికి రాత్రి తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇప్పుడు ఆయా స‌మస్య‌ల‌ను మించి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారికి తీసింది. అదే.. కీల‌క‌మైన `హెచ్ - 1 బీ` వీసాపై ఆంక్ష‌ల కొర‌డా!. ఈ వీసాల విష‌యంలో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ ఆంక్ష‌లు విధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు లాట‌రీ విధానంలో ఉన్న ఈ వీసాల‌ను పొందే అవ‌కాశం.. ఇక‌, నుంచి ఉండ‌దు.

ఈ నెల 21 నుంచి దేశంలోకి ప్ర‌వేశించాల‌ని అనుకునే హెచ్‌-1బీ వీసాదారులు.. భార‌త క‌రెన్సీలో 89 ల‌క్ష‌ల రూపాయలు వెచ్చించాలి. దీంతో అమెరికాకు వెళ్లాల‌నుకునే సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇది శ‌రాఘాతంగా మార‌నుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఒక్క‌టే కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అనేక నిర్ణ‌యాలు కూడా మార్చారు. గ‌తంలో గ్రీన్ కార్డు(అంటే పౌర‌స‌త్వం) పొందేందుకు ఉన్న నిబంధ‌న‌లు కూడా మార్చేశారు. దీనికి కూడా వెల క‌ట్టారు. గోల్డెన్ కార్డును కొనుగోలు చేసిన వారికి(10 ల‌క్ష‌ల డాల‌ర్లు) గ్రీన్ కార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు హెచ్ - 1 బీ వీసా చేరింది.

అస‌లేంటీ వీసా?

`హెచ్‌-1బీ` అనేది అమెరికాలో వలసేతర వీసా. అంటే.. అక్క‌డ శాశ్వ‌త నివాసం పొంద‌కుండా.. కీల‌క‌మైన కంపెనీల్లో వృత్తి వుద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఐటీ, ఫ్యాషన్ రంగాల్లో ప‌నిచేసేందుకు విదేశీయుల‌ను అనుమ‌తిస్తుంది. ఇవి హైప్రొఫైల్ జాబ్స్‌గా అమెరికా పేర్కొంటుంది. వేత‌నాలు కూడా భారీగానే ఉంటాయి. అంతేకాదు.. వీటిని పొందాల‌నుకునే వారు అత్యంత స‌మ‌ర్ధులైన , ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన వారై ఉండాలి. అంతేకాదు.. కొన్ని షరతులకు అనుగుణంగా రక్షణ శాఖ ప్రాజెక్టులలో కూడా ఉద్యోగాలు పొందే అవ‌కాశం హెచ్‌-1బీ వీసా క‌ల్పిస్తుంది.

నిబంధ‌న‌లు ఎందుకు?

ప్ర‌స్తుతం `మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌`(మాగా) నినాదాన్ని ప‌ఠిస్తున్న ట్రంప్‌.. స్వ‌దేశీయుల‌కు మాత్ర‌మే అవ‌కాశాలు ద‌క్కాల‌న్న ఉద్దేశంతో ఉన్నారు. విదేశీయుల రాక‌ను తగ్గించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌ల‌సేత‌ర చ‌ట్టాలు స‌హా వ‌ల‌స చ‌ట్టాల్లోనూ మార్పులు చేశారు. చ‌దువుకునే వారి నుంచి ఉద్యోగాలు చేసుకునే వారి వ‌ర‌కు అనేక మందికి సంబంధించిన చ‌ట్టాల‌ను మార్చుతున్నారు. ఈక్ర‌మంలోనే హెచ్‌-1బీ వీసాల‌ను మార్చేశారు. ఇటీవ‌ల‌.. విశ్వ‌విద్యాల‌యాలు.. కాలేజీల‌కు సంబంధించిన బీ1, బీ2 వీసాల‌ను కూడా మార్చారు.

ఎవ‌రికి న‌ష్టం?

వాస్త‌వానికి అమెరికాలో ఉన్న విద్యావ్య‌వ‌స్థ ను ప‌రిశీలిస్తే.. అది ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిర్బంధ విద్య‌(భార‌త్‌లో మాదిరిగా) లేదు. దీంతో ఉన్న‌త‌శ్రేణి విద్యార్థులు, ఉద్యోగులు, నైపుణ్యం ఉన్న‌వారు అమెరికాలో స్థానికంగా చాలా చాలా త‌క్కువ‌గా ఉన్నారు. దీంతో కీల‌క‌మైన సంస్థ‌లు విదేశాల నుంచి ఉద్యోగుల‌ను ర‌ప్పించుకుని ప‌నుల్లో పెట్టుకుంటున్నాయి. ఇది లేకుండా చేయాల‌ని.. స్థానికంగా ఉన్న‌వారికే అవ‌కాశం క‌ల్పించాల‌న్న‌ది ట్రంప్ వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హెచ్‌1బీపై పిడుగువేశారు. దీనివ‌ల్ల అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌పై పెను భారం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట‌.