ట్రంప్ తాత.. నీ ఫిట్టింగ్ కు ఇక 'హెచ్1బీ' ఉద్యోగం ఇస్తే ఒట్టు
పాత ప్రతిపాదనలు.. కొత్త పన్నులు అన్నీ కలిపితే ఒక్కో హెచ్1బీ ఉద్యోగిపై అయ్యే ఖర్చు అక్షరాలా $2,03,265 మిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.1.7 కోట్లకు పైగా.
By: A.N.Kumar | 5 Sept 2026 6:29 PM ISTఒకప్పుడు హెచ్1బీ వీసా అంటే భారతీయ ఐటీ నిపుణుల డ్రీమ్ పక్కింటి ఆంటీకి గర్వకారణం, సంబంధాల మార్కెట్‌లో తిరుగులేని ప్రాజెక్ట్. కానీ డోనాల్డ్ తాతయ్య దెబ్బకి ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయ్యేలా ఉంది. కొత్తగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్ ) పెట్టిన ప్రతిపాదనలు చూస్తుంటే, ఒక విదేశీ ఉద్యోగిని అమెరికా తెచ్చుకోవడానికి కంపెనీలు తమ ఆస్తులు అమ్మేసుకోవాల్సి వచ్చేలా ఉంది.
పాత ప్రతిపాదనలు.. కొత్త పన్నులు అన్నీ కలిపితే ఒక్కో హెచ్1బీ ఉద్యోగిపై అయ్యే ఖర్చు అక్షరాలా $2,03,265 మిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.1.7 కోట్లకు పైగా. బాస్‌లు గనక నిజంగా ఈ అమౌంట్ చెల్లించి ఉద్యోగిని అమెరికా తీసుకెళ్లాలి అనుకుంటే విమానం టికెట్‌తో పాటు ఆ ఉద్యోగికి కిరీటం కూడా తొడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ట్రంప్ తాత లాజిక్.. 'అమెరికా ఫస్ట్... పర్స్ ఖాళీ నెక్స్ట్'
"విదేశీ ఉద్యోగులు వద్దు.. స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి" అని చెప్పడానికి ట్రంప్ ఎంచుకున్న మార్గం నిజంగా జోహార్లు అర్పించాల్సింది. కంపెనీల నెత్తి మీద రూ.1.7 కోట్ల ఫీజు భారం పెడితే ఇక ఏ కంపెనీ అయినా విదేశీయుల వైపు చూస్తుందా? అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాలు 'మా దగ్గర డాలర్ల వర్షం కురుస్తోందిలే' అని భరించొచ్చేమో గానీ చిన్న చిన్న స్టార్టప్‌లు, ఆసుపత్రులు, యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? "మీరు పైథాన్ వచ్చా? జావా వచ్చా?" అని అడిగే బదులు "మీ మీద రూ.1.7 కోట్లు తగలేసేంత రేంజ్ మీకు ఉందా?" అని అడిగినా ఆశ్చర్యం లేదు. ఈ దెబ్బకి ఇప్పటికే అప్లికేషన్లు 87 శాతం పడిపోయాయట. మొదటి ఐదు నెలల్లో కేవలం 85 మందే దరఖాస్తు చేసుకున్నారంటే.. ట్రంప్ ప్లాన్ ఎంత 'సక్సెస్' అయిందో అర్థం చేసుకోవచ్చు!
మన దేశీ నిపుణుల పరిస్థితి ఏంటి?
ఇన్నాళ్లూ విదేశీ కలలతో రాత్రంతా కోడింగ్ చేసిన భారతీయ కుర్రాళ్లకు ఇప్పుడు కొత్త సందేహం మొదలైంది. రూ.1.7 కోట్లు పెట్టి మనల్ని తీసుకెళ్లే బదులు.. ఆ డబ్బేదో బెంగళూరులోనే పెట్టి మనతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోవడం కంపెనీలకు చౌక కదా.. పైగా ఆ మొత్తంతో హైదరాబాద్ లేదా బెంగళూరులో ప్రశాంతంగా విల్లా కొనుక్కుని రాజులా బతికేయొచ్చు.
ఈ ప్రతిపాదనలు, కోర్టు కేసులు, డీహెచ్ఎస్ $8.8 బిలియన్ల వసూళ్ల టార్గెట్లు ఎటు తేలుతాయో సెప్టెంబర్ 24 పబ్లిక్ కామెంట్ల గడువు ముగిశాకే తెలుస్తుంది.
ఏది ఏమైనా "అమెరికా వెళ్లడం ఎంత కష్టమో.. అక్కడికి పంపించడం అంతకంటే ఖరీదు" అని ట్రంప్ తాత నిరూపిస్తున్నారు.
