Begin typing your search above and press return to search.

సెనేట్ సెగ‌లు: వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శ‌నివారం ప్ర‌క‌టించిన హెచ్‌-1బీ వీసా నిబంధనల‌లో స్వ‌ల్ప మార్పులు చేశారు.

By:  Garuda Media   |   21 Sept 2025 3:38 PM IST
సెనేట్ సెగ‌లు:  వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌!
X

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శ‌నివారం ప్ర‌క‌టించిన హెచ్‌-1బీ వీసా నిబంధనల‌లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లివిట్ తాజాగా ప్ర‌క‌ట‌న జారీ చేశారు. హెచ్‌-1బీ వీసా పొందేందుకు ల‌క్ష డాల‌ర్ల వ‌ర‌కు రుసుము విధించ‌గా.. దీనిని కేవ‌లం కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి మాత్ర‌మే ప‌రిమితం చేసిన‌ట్టు వివ‌రించారు. ఇప్పటికే ఈ వీసాలు కలిగి ఉన్నవారు ఎలాంటి ఆందో ళ‌నా చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

అదేవిధంగా ఇప్ప‌టికే హెచ్ 1 బీ వీసాలు కలిగి ఉండి.. దేశం వెలుపల ఉన్నవారు తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. ఈ వీసా హోల్డర్లు ఎప్పటిలాగానే.. దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చున‌ని వివ‌రించారు. వాస్త‌వానికి హెచ్ 1 బీ వీసాకు ల‌క్ష డాల‌ర్లు చెల్లించాలంటూ.. అధ్య‌క్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేసిన ద‌రిమిలా.. ప్ర‌పంచ దేశాలు ఉలిక్కిప‌డ్డాయి. వీటిలో భార‌త్ కూడా ఉంది.

అయితే.. ఇప్ప‌టికే సుంకాల పెంపుతో అమెరికా ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌డం, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోయిన నేప‌థ్యంలో ట్రంప్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు ఊపందుకున్నాయి. ఇక‌, ఇప్పుడు హెచ్ 1 బీ వీసాల రుసుముల పెంపుతో దేశానికి వ‌చ్చే వారు త‌గ్గిపోతార‌ని, త‌ద్వారా ఆదాయం తీవ్ర‌స్థాయిలో ప‌డిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. మ‌రీ ముఖ్యంగా ఇప్పటికే వీసాపై ఉన్నవారు కూడా లక్ష డాలర్ల రుసుము చెల్లించాల‌ని పేర్కొన‌డంతో(తాజాగా మార్చారు) ఇది మ‌రింత వివాదానికి తెర‌దీసింది.

ఇంకోవైపు.. సెనేట్ మాన్ సూన్ సీజ‌న్ స‌మావేశాలు ఈనెలాఖ‌రులో ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై స‌భ‌లో చ‌ర్చించి.. వాటిని ర‌ద్దు చేయించే దిశ‌గా విప‌క్ష స‌భ్యులు వ‌త్తిడి పెంచే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా విధించిన ల‌క్ష డాల‌ర్ల రుసుము నిర్ణ‌యాన్ని స్వ‌ల్పంగా స‌డ‌లించారు. అయితే.. ఇది కొంత వ‌ర‌కు సెగ‌ను త‌గ్గిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీని ప్ర‌కారం.. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదు. అదేస‌మ‌యంలో విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన పనిలేదు.