Begin typing your search above and press return to search.

హెచ్‌-1బీ వీసా.. అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ!

తమ పిల్లలు అమెరికాలో స్థిరపడి, ఉన్నత స్థానాల్లో ఉన్నారని గర్వపడుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

By:  A.N.Kumar   |   22 Sept 2025 10:00 PM IST
హెచ్‌-1బీ వీసా.. అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ!
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు (దాదాపు రూ.88 లక్షలు) పెంచినట్లు సమాచారం రావడంతో అక్కడ ఉద్యోగాలు చేసేవారు.. విద్యార్థులు మాత్రమే కాదు, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉలిక్కిపడుతున్నారు.

* ఏటా వందలాది మంది అమెరికా ప్రయాణం

ప్రతి సంవత్సరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 500-800 మంది ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 52 వేల మంది కరీంనగర్ జిల్లా వాసులు నివసిస్తున్నారు. వారిలో 40 శాతం పైగా ఉద్యోగులు హెచ్‌-1బీ వీసాతో ఉన్నారు. ఫీజు పెంపు నిర్ణయం వల్ల కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

తల్లిదండ్రుల్లో భయం

తమ పిల్లలు అమెరికాలో స్థిరపడి, ఉన్నత స్థానాల్లో ఉన్నారని గర్వపడుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఈ నిర్ణయం వల్ల “ఇకపై మా పిల్లల భవిష్యత్తు ఏంటి?” అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఒకరిని పంపి, మరొకరిని కూడా విదేశాలకు పంపించాలని భావించిన కుటుంబాలు ఇప్పుడు ఆలోచనలో పడిపోయాయి.

పాత వారికి ఊరట

సెప్టెంబరు 21కి ముందే హెచ్‌-1బీ వీసా పొంది ఉన్నవారు యథావిధిగా రాకపోకలు సాగించవచ్చని అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం పాత వీసాధారులకు కొంత ఊరట కలిగిస్తోంది. అయితే కొత్తవారికి ఈ ఫీజు పెంపు పెద్ద అడ్డంకిగా మారింది.

కంపెనీల ఆందోళన

అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ఇంత భారీ ఫీజు చెల్లించాల్సి రావడం వల్ల భయపడుతున్నాయి. ఇప్పటికే లాభాలపై ఒత్తిడి పెరిగిన ఈ సంస్థలు, ఇకపై భారతీయులను ఉద్యోగాలకు తీసుకోవడంలో వెనుకంజ వేయవచ్చని అంచనా. దీంతో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గందరగోళంలో ప్రజలు

అధ్యక్షుడు, కామర్స్ సెక్రటరీ, ఇమిగ్రేషన్ అధికారులు వేర్వేరుగా ప్రకటనలు చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. “ఇది అందరికీ వర్తిస్తుందా? లేక కొత్తవారికేనా?” అనే ప్రశ్నలకు ఇంకా పూర్తి సమాధానం రాలేదు. ప్రతినిధుల సభ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పరిస్థితి అనిశ్చితిలోనే కొనసాగనుంది.

మొత్తంగా, ట్రంప్ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా కలలు కంటున్న వందలాది కుటుంబాలు ఇప్పుడు “ఏం చేస్తుందో అమెరికా ఇంకా!” అంటూ వేచి చూస్తున్నాయి.