Begin typing your search above and press return to search.

లక్ష డాలర్లు.. హెచ్ 1బీ వీసా ఫీజు.. భారతీయుల మీద సరికొత్త పిడుగు

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే ఎంతో మంది ఐటీ ఉద్యోగులకు తాజా నిర్ణయం శరాఘాతంగా మారనుంది.

By:  Garuda Media   |   20 Sept 2025 8:45 AM IST
లక్ష డాలర్లు.. హెచ్ 1బీ వీసా ఫీజు.. భారతీయుల మీద సరికొత్త పిడుగు
X

అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాలు భారత్ కు.. భారతీయుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా చెప్పాలి. తాజా నిర్ణయంతో డాలర్ డ్రీమ్స్ ను దారుణంగా దెబ్బ తీసేలా మారిందని చెప్పాలి. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న హెచ్ 1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేస్తూ ట్రంప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది కచ్ఛితంగా భారతీయులకు పిడుగు లాంటి వార్తగా చెప్పక తప్పదు.

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే ఎంతో మంది ఐటీ ఉద్యోగులకు తాజా నిర్ణయం శరాఘాతంగా మారనుంది. ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు.. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీచేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో భారత్ తో పాటు చైనాలు తీవ్ర ప్రభావానికి గురి కానున్నాయి. సరికొత్త హెచ్ 1 బీ వీసా ఫీజు.. విధానానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ జారీ చేశారు.

ఇకపై ప్రతి హెచ్ 1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుము విధించినట్లు చెప్పిన ఆయన.. ఈ విషయాన్ని అన్ని పెద్ద కంపెనీలకు తాము సమాచారాన్ని అందించినట్లు చెప్పారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలని భావిస్తే ఇటీవల అమరికాలోని గొప్ప వర్సిటీల నుంచి పట్టభద్రులైన మనోళ్లకు ఇవ్వాలన్న ఆయన.. ‘‘అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాల్ని కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపండి’ అంటూ మీడియా సమావేశంలో లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు ఉన్న హెచ్1 బీ వీసా ఫీజు ఎంత? పెరిగిన ఫీజు మన రూపాయిల్లో ఎంత? అన్నది చూస్తే.. ఎంత అడ్డగోలుగా.. దారుణంగా పెంచేశారో అర్థమవుతుంది. ఇప్పటివరకు హెచ్ 1బీ వీసా కోసం కంపెనీలు పెడుతున్న ఖర్చు కనిష్ఠంగా రూ.1.70 లక్షల నుంచి రూ.6.50 లక్షలు ఉండేది. తాజాగా పెంచిన హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు.. అంటే ఏకంగా రూ.84 లక్షలు అవుతుంది. ఇంత భారాన్ని ఏ కంపెనీ కూడా మోసే అవకాశం ఉండదు. ఎంతటి గొప్ప మానవ వనరు అయినప్పటికీ సదరు వ్యక్తి మీద ఇంత భారీ మొత్తాన్ని వెచ్చింది అమెరికాకు తీసుకెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయదు. దీంతో.. భారతీయుల మీద ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం శరాఘాతంగా మారుతుందని చెప్పక తప్పదు.

హెచ్ 1బీ వీసా విధానాన్ని అమెరికా ఎప్పుడు తీసుకొచ్చింది? ఏ పరిస్థితుల్లో తెచ్చిందన్నది చూస్తే. అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీ నిపుణుల కోసం ఈ వీసా విధానాన్ని 1990లో తీసుకొచ్చారు. దాదాపు అమెరికాలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఈ వీసాల్ని జారీ చేస్తారు. హెచ్ 1బీ వీసాదారుల్లో భారత్ వాటా 71శాతం అయితే.. చైనా 11.7 శాతం వాటా కలిగింది ఉంది. వీటిని మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తుంటారు. ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

ప్రస్తుతం హెచ్ 1బీ వీసా అప్లికేషన్ ను పిక్ చేసుకునేందుకు లాటరీ పద్దతి ఉంది. తొలుత లాటరీ అప్లికేషన్ కు సాధారణ చార్జీలు చెల్లించి.. లాటరీలో ఎంపికైతే అదనపు మొత్తాన్ని చెల్లించేలా ఏర్పాటు ఉంది. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీల్ని భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను బారంగా మారుతుంది అమెరికా ఏటా 85 వేల వీసాల్ని లాటరీ విధానంలో జారీ చేస్తే.. అందులో దగ్గర దగ్గర 55 నుంచి 70 వేల మంది మనోళ్లే ఎంపిక అయ్యేవారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ టెకీల డాలర్ డ్రీమ్స్ కు భారీగా దెబ్బ పడనుందని చెప్పక తప్పదు.