Begin typing your search above and press return to search.

ట్రంప్ కు షాక్ : హెచ్‌-1బీపై భారీ న్యాయపోరాటం

ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం, యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్ (USCIS) కేవలం తన కార్యకలాపాల నిర్వహణ ఖర్చులకు సరిపోయేంత ఫీజును మాత్రమే వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంది.

By:  A.N.Kumar   |   26 Sept 2025 6:00 AM IST
ట్రంప్ కు షాక్ : హెచ్‌-1బీపై భారీ న్యాయపోరాటం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ఫీజును అమాంతం $1,00,000 (సుమారు ₹83 లక్షలు) కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం దేశంలో, అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని దిగ్గజ టెక్‌ కంపెనీల కూటమి అయిన యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ పెంపును కోర్టులో సవాలు చేసేందుకు సభ్య కంపెనీల నుంచి మద్దతు కూడగడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనం పేర్కొంది.

సెప్టెంబర్ 21 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఫీజు పెంపు, కొత్తగా హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వీసాదారులు, రెన్యూవల్‌ దరఖాస్తులకు దీని నుండి మినహాయింపు ఉంది. అయితే ఈ ఒక్కసారి చెల్లించే అధిక ఫీజు కారణంగా అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుందని టెక్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యూహం

ఇప్పటికే యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పలు టెలిఫోన్‌ , వర్చువల్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, టెక్‌ సహా వివిధ రంగాల కంపెనీల ఆందోళనలను సమీకరిస్తోంది 2020లో కూడా నాన్-ఇమిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో విజయవంతంగా సవాల్ చేసింది. అదే తరహాలో ఈసారి కూడా న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చాంబర్‌ ప్రతినిధి మాట్ లెటోర్నో మాట్లాడుతూ "మా సభ్యుల ఆందోళనలు నిరంతరం మాకు చేరుతున్నాయి. వాటిని అడ్మినిస్ట్రేషన్‌ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం," అని తెలిపారు.

* చట్టబద్ధతపై సందేహాలు

ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం, యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్ (USCIS) కేవలం తన కార్యకలాపాల నిర్వహణ ఖర్చులకు సరిపోయేంత ఫీజును మాత్రమే వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఇంత భారీ మొత్తంలో సర్‌ఛార్జి విధించే అధికారం అధ్యక్షుడికి లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

మరోవైపు, దేశ భద్రతకు ముప్పు కలిగించే విదేశీయులను అడ్డుకునే అధికారం అధ్యక్షుడికి ఉందన్న అంశాన్ని ట్రంప్ వర్గం సమర్థించుకుంటోంది. అయితే, హెచ్‌-1బీ విషయంలో భద్రత కంటే ఆర్థిక ప్రయోజనాల అంశమే ప్రధానంగా కనిపిస్తుండటంతో, ట్రంప్ నిర్ణయం కోర్టులో నిలుస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది.

భారీ ఫీజు పెంపు నేపథ్యంలో ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఇది కుటుంబాలకు ఇబ్బందులు సృష్టించే మానవీయ పరిణామాలకు దారితీయవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.

మొత్తం మీద అమెరికాలోని టెక్‌ ప్రతిభ, అంతర్జాతీయ ఉద్యోగుల ప్రవాహాన్ని ప్రభావితం చేయనున్న ఈ అంశంపై తుది తీర్పు కోసం అందరూ కోర్టు వైపు చూస్తున్నారు.