Begin typing your search above and press return to search.

టెక్కీలారా... మీ వీసా పొడిగింపు పత్రాన్ని కంపెనీ హెచ్‌ఆర్‌కు పంపేముందు ఒకసారి దండం పెట్టుకోండి

అమెరికా కలలు కనే మన దేశీ టెక్కీలకు.. వారిని నమ్ముకుని కాపురం వెళ్లదీస్తున్న టెక్ దిగ్గజాలకు మామా శ్యామ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

By:  A.N.Kumar   |   10 Aug 2026 11:44 AM IST
టెక్కీలారా... మీ వీసా పొడిగింపు పత్రాన్ని కంపెనీ హెచ్‌ఆర్‌కు పంపేముందు ఒకసారి దండం పెట్టుకోండి
X

అమెరికా కలలు కనే మన దేశీ టెక్కీలకు.. వారిని నమ్ముకుని కాపురం వెళ్లదీస్తున్న టెక్ దిగ్గజాలకు మామా శ్యామ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. "నా దేశంలో ఉద్యోగం చేస్తావా? సంతోషం.. కానీ ప్రతిసారీ ఆ వీసా పొడిగించుకోవడానికి వచ్చినప్పుడు గల్లా పెట్టె తెరవాల్సిందే" అంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక సమ్మోహనకరమైన సుప్రీం ఆర్డర్ వేసింది.

సెప్టెంబర్ 9, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధన ప్రకారం... 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి అందులో సగానికి పైగా హెచ్1బీ, ఎస్-1 వీసాదారులే ఉన్న 'మనవారే ఉన్నంతవరకు' టైప్ కంపెనీలు ఇకపై ప్రతి ఎక్స్‌టెన్షన్‌కూ $4,000.. ఎల్-1 అయితే ఏకంగా $4,500 సమర్పించుకోవాలి.

మేము ఫీజు పెంచలేదు.. వసూలు చేసే పరిధి పెంచామంతే..

అమెరికా ఎంత మంచోదంటే.. "బాబూ.. మేము కొత్తగా ఒక్క డాలర్ కూడా ఫీజు పెంచలేదు తెలుసా? పాత ఫీజునే అందరి దగ్గరా ముక్కు పిండి వసూలు చేయాలని నిర్ణయించామంతే" అని చాలా అమాయకంగా చెప్తోంది. ఇప్పటివరకు వీసా ఎక్స్‌టెన్షన్‌కి చిన్న మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ సందును కూడా సిమెంట్ వేసి పూడ్చేశారు.

$4,000 అంటే ఐఫోన్లు, కార్లు కొనుక్కునే దాచిన డబ్బులన్నీ పోతాయా? అని బెంగపడకండి. ఈ ఫీజును ఉద్యోగుల జేబులోంచి తీయడానికి వీల్లేదని.. కంపెనీలే తమ సొంత ఖజానా నుంచి కట్టాలని హెచ్చరించారు. "పోనీలే.. నా వీసా కాబట్టి నేనే కట్టుకుంటా" అని జాలిపడి ఉద్యోగి కడతానన్నా డీహెచ్ఎస్ ఒప్పుకోదట! ఎంత ప్రేమనో కదా..

అసలు కథ ఇక్కడే ఉంది...

ఉద్యోగి కట్టక్కర్లేదని మురిసిపోవడానికి ఏమీ లేదు. కంపెనీకి ప్రతి ఎక్స్‌టెన్షన్‌కు లక్షల రూపాయల అదనపు భారం పడుతుంటే వాళ్లు ఊరికే ఉంటారా? "ఎందుకు వచ్చిందిరా బాబూ ఈ విదేశీ నిపుణుల గోల" అని ఖర్చుల లెక్కలు తీయడం మొదలుపెడతారు. పరోక్షంగా కోత పడేది మన ఉద్యోగుల జీతాలు లేదా ఆన్-సైట్ అవకాశాల మీదే.. ఈ లాజిక్ మరిచిపోవద్దు..

ఈ డబ్బులతో ఏం చేస్తారంటే?

అమెరికా దాచేసి చెప్పిన నిజం ఏంటంటే 2016లో ఈ ఫీజుల ద్వారా $158 మిలియన్లు వస్తే 2025 నాటికి అది కాస్తా $25.6 మిలియన్లకు పడిపోయిందట. పాపం ఖజానా ఖాళీ అయిపోతుంటే ఊరుకుంటారా? అందుకే విమానాశ్రయాల్లో మీరు ముఖం చూపించగానే గుర్తుపట్టే 'ఫేషియల్ రికగ్నిషన్' కెమెరాలు, బయోమెట్రిక్ వ్యవస్థల నిర్వహణకు ఈ $37.9 మిలియన్ల అదనపు వసూళ్ల ప్రణాళిక వేశారు.

మొత్తానికి, టెక్కీలారా... మీ వీసా పొడిగింపు పత్రాన్ని కంపెనీ హెచ్‌ఆర్‌కు పంపేముందు ఒకసారి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఆ పేపర్‌తో పాటు నాలుగు వేల డాలర్ల చెక్కు కూడా వెళ్లాలిగా మరి..