ట్రంప్ ప్రకటనపై వైట్ హౌస్ క్లారిటీ.. హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఊరట
బాధ్యత లేకుండా మాట్లాడటం నోటికి వచ్చినట్లుగా నిర్ణయాలు వెల్లడించటం లాంటివి చేయటంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు వరుసలో ఉంటారన్నది తెలిసిందే.
By: Garuda Media | 26 Nov 2025 7:00 PM ISTబాధ్యత లేకుండా మాట్లాడటం నోటికి వచ్చినట్లుగా నిర్ణయాలు వెల్లడించటం లాంటివి చేయటంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు వరుసలో ఉంటారన్నది తెలిసిందే. ఇటీవల ఆయన చేసిన ఒక వ్యాఖ్య కొత్త దుమారాన్ని రేపటమే కాదు.. భారత్ కు చెందిన హెచ్ 1బీ వీసాదారుల్లో ఆందోళనకు గురి చేసింది. భారత ఉద్యోగులకు బదులుగా అమెరికన్లతో భర్తీ చేసి వారిని స్వదేశానికి తిప్పి పంపాలని ట్రంప్ యోచిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి వాటికి అమెరికా అధ్యక్షుడు అస్సలు మద్దతు ఇవ్వటం లేదని వైట్ హౌస్ తాజాగా స్పష్టం చేసింది.
హెచ్ 1బీ వీసాదార్లను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ.. ఈ కన్ ఫ్యూజన్ మీద క్లారిటీ ఇచ్చారు. హెచ్ 1బీ వీసాలను గురించి ఆయనకున్న అవగాహన అత్యంత పరిమితంగా పేర్కొన్న లెవిట్.. ట్రంప్ కు ఉన్నది సాధారణ అవగాహనతో కూడిన అవగాహనగా పేర్కొన్నారు. ‘ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అధ్యక్షుని కోరికల్లా ఒక్కటే.. విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ నిపుణులతో పాటు అమెరికన్లను వెంట పెట్టుకురావాలి. కొత్త తరం వాణిజ్య పోరులో ఏ దేశాన్నైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీలాంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను టాప్ లో ఉంచాలి’’ అని పేర్కొన్నారు. అంతిమంగా అయా ఉద్యోగాల్లో అమెరికన్లు ఉండేలా చూడాలన్నదే ట్రంప్ టార్గెట్ అన్న ఆయన.. అమెరికాలో వ్యాపారం చేయాలంటే తమ దేశస్తులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటే మంచిదన్న విషయాన్ని ఈ మధ్యన పేర్కొన్నప్పటికి అధ్యక్షుల వారి ఆలోచన వేరన్న విషయాన్ని పేర్కొన్నారు.
‘‘ప్రస్తుత కన్ఫ్యజన్ మొత్తానికి అధ్యక్షుల వారి స్టేట్ మెంటే కారణం. కానీ.. ఆయన ఉద్దేశం అంతా అనుకుంటున్నది కాదు. ఉత్పత్తి రంగంలో అమెరికా గతంలో లేనంతగా కోలుకొని దూసుకుపోవాలన్నదే ట్రంప్ కల. నిజానికి ఆయా దేశాలపై టారిఫ్ ల విధింపు వెనుక అధ్యక్షుని ఏకైక ఉద్దేశం అదే’’ అని పేర్కొన్నారు. అయితే.. తాజా గందరగోళానికి కారణం.. అమెరికాకు వచ్చే విదేశీ కంపెనీలు తమ నిఫుణులను వేలాదిగా అమెరికాకు తీసుకొచ్చి.. వారి నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పి వారి సొంత దేశాలకు వెళ్లిపోవాలన్న మాటలే. అయితే.. ట్రంప్ ఆలోచన వేరని.. ఆయన మాటలు అందుకు భిన్నంగా రావటంతో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా వైట్ హౌస్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.
