ట్రంప్ కు షాక్ ఇచ్చిన నాటో దేశాలు.. గ్రీన్ ల్యాండ్ కు సైన్యం
గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ మరో అడుగు ముందుకు వేశారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం అదనపు టారిఫ్ విధింపు అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
By: A.N.Kumar | 19 Jan 2026 12:53 PM ISTగ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ మరో అడుగు ముందుకు వేశారు. గ్రీన్ ల్యాండ్ విషయంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం అదనపు టారిఫ్ విధింపు అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అదే సమయంలో అప్పటికీ దిగిరాకపోతే ఆయా దేశాలపైన 25 శాతం అదనపు టారిఫ్ జూన్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. డెన్మార్క్ లో భాగంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ ను జాతీయ భద్రత పేరుతో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
చైనా, రష్యాల పేరుతో..
గ్రీన్ ల్యాండ్ లో చైనా, రష్యాల కార్యకలాపాలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. కానీ గ్రీన్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం నాటో స్పూర్తి విరుద్ధమని యూరోపియన్ యూనియన్ దేశాలు ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. గ్రీన్ ల్యాండ్ స్వాధీనం రష్యా, చైనాలకు అనుకూలంగా మారుతుందని హెచ్చరించాయి. బ్రిటన్ అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లపై స్పందించారు. అదనపు టారిఫ్ పేరుతో హెచ్చరించడం ఘోర తప్పిదమని కీర్ స్టార్మర్ అన్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రకటించారు. గ్రీన్ ల్యాండ్ భద్రత నాటో దేశాల బాధ్యత అని యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాలు గ్రీన్ ల్యాండ్ కు తమ భద్రతా బలగాలను తరలించాయి.
నాటో దేశాల హెచ్చరిక..
డెన్మార్క్, అమెరికా రెండూ కూడా నాటో దేశాలే. నాటో దేశాలపై ఇతర దేశాలు దాడి చేస్తే ఉమ్మడిగా దాడి చేసే ఒప్పందంతో నాటో ఏర్పడింది. ఇప్పుడు నాటో దేశంపైనే ట్రంప్ దాడికి ప్రయత్నించడం.. ఇతర నాటో దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాటో స్పూర్తికి విరుద్ధమని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు గ్రీన్ ల్యాండ్ కు మద్దతుగా భద్రతా బలగాలను తరలించడంతో .. అమెరికా అదనపు సుంకాల పేరుతో బెదిరింపులకు దిగింది. దీంతో అమెరికా తదుపరి స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. యూరోపియన్ యూనియన్ దేశాలు గ్రీన్ ల్యాండ్ కు మద్దతుగా నిలవడంతో నాటో దేశాలన్నీ ఒకవైపు ... అమెరికా ఒకవైపు నిలబడింది. ట్రంప్ వైఖరిపైన యూరోపియన్ యూనియన్ దేశాలు వేర్వేరుగా స్పందించాయి. ట్రంప్ వైఖరిని తప్పుపట్టాయి. గ్రీన్ ల్యాండ్ రక్షణ తమ బాధ్యతగా ప్రకటించాయి. దీంతో అమెరికా కొంత సందిగ్ధంలో పడింది.
ఎవరెలా స్పందించారు..
నాటో దేశాలు గ్రీన్ ల్యాండ్ భద్రత కోసం ప్రయత్నిస్తుంటే.. ఆ దేశాలపై అదనపు టారిఫ్ పేరుతో బెదిరించడం తప్పిదంగా బ్రిటన్ అధ్యక్షుడు అభివర్ణించారు. గ్రీన్ ల్యాండ్ ఎప్పటికీ డెన్మార్క్ లో భాగమని పేర్కొన్నారు. అదనపు టారిఫ్ పేరుతో బెదిరించడం సరికాదుని, అలాంటి వాటికి లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రకటించారు. మిత్రదేశాల మధ్య విబేధాలు చైనా,రష్యాలకు ప్రయోజనంగా మారుతాయని ఈయూ విదేశాంగ శాఖ విధాన చీఫ్ ఖాజా అభిప్రాయపడ్డారు. తమను బ్లాక్ మెయిల్ చేయలేరంటూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్స్న్ ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడటానికి యూరోపియన్ యూనియన్ ఎప్పుడూ ధృడంగా ఉంటుందని యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు.
