Begin typing your search above and press return to search.

ప్రపంచానికి శనిలా దాపురించిన ట్రంప్.. మార్కెట్లు క్రాష్

ఒకటి తర్వాత ఒకటి చొప్పున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న విధానపరమైన నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

By:  Garuda Media   |   21 Jan 2026 12:38 PM IST
ప్రపంచానికి శనిలా దాపురించిన ట్రంప్.. మార్కెట్లు క్రాష్
X

ఒకటి తర్వాత ఒకటి చొప్పున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న విధానపరమైన నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అతడి తీరుతో ప్రపంచం కల్లోల స్థాయికి చేరుకుంది. మొన్నటివరకు ఇరాన్ మీద పడ్డ అతను.. ఇప్పుడు యూరోప్ లోని గ్రీన్ ల్యాండ్ ను అమెరికాకు ఇచ్చేయాలని చెప్పటం తెలిసిందే. ట్రంప్ పోకడలకు ప్రపంచంలోని ప్రధాన స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బ తీశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో మార్కెట్ క్రాష్ అయిన పరిస్థితి. దీంతో భారత్ తో పాటు పలు దేశాల్లోనూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఇంత చేస్తున్న ట్రంప్ నిర్ణయాలతో.. అమెరికా స్టాక్ మార్కెట్ నెగిటివ్ గా రియాక్టు కావటం గమనార్హం. ఈ పరిణామాల్ని చూసినప్పుడు ప్రపంచానికి ట్రంప్ పెను ముప్పుగా మారాడన్న భావన కలుగక మానదు.

ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఒక్క మంగళవారం (జనవరి 20) భారత స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనమైంది. మంగళవారం సెన్సెక్స్ 1066 పాయింట్లు పతనమైతే.. నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. ఈ ముగింపు రెండు సూచీల మూడు నెలల కనిష్ఠం కావటం గమనార్హం. ఈ పతనాన్ని రూపాయిల్లో లెక్క కడితే.. మంగళవారం ఒక్క రోజునే దగ్గర దగ్గర రూ.10 లక్షల కోట్ల మదుపురల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా చెప్పే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు దిగి రావటం గమనార్హం.

ట్రంప్ కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రంప్ నోటి నుంచి తరచూ వస్తున్న సుంకాల షాక్ ఆయా దేశాల స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. గ్రీన్ ల్యాండ్ ఇష్యూతో యూరోపియన్ దేశాలపై కొత్తగా 10 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వార్నింగ్ తో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు పలు దేశాల సూచీలు దెబ్బ తిన్నాయి. దీంతో సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతున్నారు. ఈ కారణంగానే బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. వెండి ధరలు భగ్గుమంటున్న పరిస్థితి.

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన నాటినుంచి అమెరికా ఫస్ట్ విధానాన్ని ప్రస్తావిస్తూ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న పరిస్థితి. జనవరి 20 చూసుకుంటే.. దాదాపుగా ప్రధాన సూచీలు ఒక శాతం నుంచి 2.4 శాతం వరకు నష్టపోవటం కనిపిస్తుంది. గ్రీన్ లాండ్ ఇష్యూపై ట్రంప్ నిర్ణయాలతో అమెరికా స్టాక్ మార్కెట్ సైతం ప్రతికూలంగా స్పందించింది.

నాస్‌డాక్ 2.39 శాతం నష్టపోతే.. ఎస్ అండ్ పీ 500 సూచీ 2.06 శాతం.. డోన్ జోన్స్ 1.76 వాతం నష్టపోయాయి. గత అక్టోబరు తర్వాత మార్కెట్లకు అత్యంత దారుణమైన రోజుగా అభివర్ణిస్తున్నారు. యూరోపియన్ మార్కెట్లు సైతం ఎర్ర సముద్రాన్ని తలపించాయి, జర్మనీ మార్కెట్ 1.03 శాతం.. ఫ్రాన్స్ 1.78 శాతం.. యూకే 0.67 శాతం నష్టపోయాయి. ఆసియాలోని జపాన్ కు చెందిన నిక్కీ 225 సూచీ 1.11 శాతం పతనమైంది. ఇలా ప్రధాన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురి కావటం గమనార్హం. ఆసక్తికర అంశం ఏమంటే.. ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లు నెగిటివ్ గా రియాక్టు అవుతున్న వేళ.. చైనా స్టాక్ మార్కెట్ మాత్రం లాభపడింది. దీనికి కారణం చైనా ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ ఉపశమన చర్యలుగా చెబుతున్నారు. ట్రంప్ ఫుణ్యమా అని బంగారం ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో భారత రూపాయి అమెరికా డాలర్ తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జనవరి 20న రూ.90.97 వద్దకు చేరుకుంది.