వెనెజులా సెక్యూరిటీ చీఫ్.. గ్రీన్ లాండ్.. రోజులు కౌంట్ డౌన్
మరొక్క 20 రోజులు.. గ్రీన్ ల్యాండ్ కు అమెరికా విధించిన డెడ్ లైన్ ! వెనెజులా సెక్యూరిటీ చీఫ్ కు అయితే అంత సమయం కూడా లేనట్లే..!
By: Tupaki Political Desk | 7 Jan 2026 5:34 PM ISTమరొక్క 20 రోజులు.. గ్రీన్ ల్యాండ్ కు అమెరికా విధించిన డెడ్ లైన్ ! వెనెజులా సెక్యూరిటీ చీఫ్ కు అయితే అంత సమయం కూడా లేనట్లే..! ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే..! వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను పట్టుకు రావడం అయిపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆ ద్వీపం తమ దేశంలో కలవాల్సిందేనని.. తమ జాతీయ భద్రతకు ఇది చాలా అవసరం అని పునరుద్ఘాటించింది. గ్రీన్ ల్యాండ్ పై కంట్రోల్ కు తమ వద్ద చాలా మార్గాలు ఉన్నాయని.. అందులో సైనిక చర్య ఒకటి అంటూ ఏకంగా ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పష్టం చేయడం గమనార్హం.
సైనిక చర్య అంటే.. కలిపేసుకోవడమే!
గ్రీన్ ల్యాండ్ ప్రాదేశికంగా డెన్మార్క్ ది. స్వయంప్రతిపత్తితో ఉంటుంది. అలాంటి ప్రాంతంపై సైనిక చర్య అంటే ట్రంప్ యంత్రాంగం కలిపేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆర్కిటిక్ ప్రాంతలో గ్రీన్ ల్యాండ్ చాలా కీలకం. ఇదే విషయాన్ని చెబుతున్న అమెరికా.. ప్రత్యర్థులైన చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకు గ్రీన్ ల్యాండ్ తమ అదుపులో ఉండాలని ట్రంప్ భావిస్తున్నట్లు కరోలిన్ పేర్కొన్నారు. ఈ దిశగా ముందుకెళ్లేందుకు అన్ని మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించినట్లు స్పష్టం చేశారు.
20 రోజులేనా..
గ్రీన్ ల్యాండ్ విషయమై 20 రోజుల్లో మాట్లాడుదాం అంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది వరకు ట్రంప్ సర్కారులో పనిచేసిన కేటీ మిల్లర్ సైతం.. త్వరలో అంటూ ట్వీట్ చేశారు. దీంతోనే అమెరికా ఈ నెలాఖరులోపే గ్రీన్ ల్యాండ్ పై ఏదో ఒక చర్య చేపడుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆయనకు అయితే.. ఆ అవకాశమూ లేనట్లేనా?
మదురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో.. ఆయన ప్రభుత్వంలో ముఖ్యులైన అమెరికా వ్యతిరేకులపై ట్రంప్ అఫీషియల్స్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. వీరిలో కీలకంగా ఉన్నది డియోస్టాడో కాబెల్లో. వెనెజులా అంతర్గత మంత్రి అయిన ఈయనకు అమెరికా ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. వెనెజులా భద్రతా దళాలు డియోస్టాడో అదుపులోనే ఉంటాయి. అందుకని, తమకు సహకరించకుంటే మదురోలాగానే నీకూ కష్టాలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తో డియోస్టాడోకు విభేదాలు ఉన్నాయి. ఆయన తిరుగుబాటు చర్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు. అందుకని భద్రతా దళాల చీఫ్ గా తప్పించే యోచన కూడా చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. వెనెజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో పైనా అమెరికా ఓ కన్నేసింది.
