Begin typing your search above and press return to search.

గ్రీన్ లాండ్ డబ్బుతో కొనాలని ట్రంప్ స్కెచ్.. డెన్మార్క్ యుద్ధానికి రెడీ

డొనాల్డ్ ట్రంప్.. ఒక రాజకీయ నాయకుడు, దేశ అధ్యక్షుడిగా అస్సలు ఆలోచించడం లేదు. పక్కా వ్యాపారిగానే తన పాత వాసనలను రాజకీయాల్లోనూ అమలు చేస్తున్నారు.

By:  A.N.Kumar   |   9 Jan 2026 1:00 PM IST
గ్రీన్ లాండ్ డబ్బుతో కొనాలని ట్రంప్ స్కెచ్.. డెన్మార్క్ యుద్ధానికి రెడీ
X

డొనాల్డ్ ట్రంప్.. ఒక రాజకీయ నాయకుడు, దేశ అధ్యక్షుడిగా అస్సలు ఆలోచించడం లేదు. పక్కా వ్యాపారిగానే తన పాత వాసనలను రాజకీయాల్లోనూ అమలు చేస్తున్నారు. చమురు కోసం వెనిజువెల మీద దాడిచేసి ఆక్రమించడం.. ఇరాన్ లోని చమురు కోసం అక్కడ ప్రజా వ్యతిరేక ఆందోళనలకు మద్దతివ్వడం.. మాట వినని భారత్ వంటి దేశాలపై టారిఫ్ లు వేయడంతో ట్రంప్ పక్కా ప్రొఫెషనల్ వ్యాపారిగానే కనిపిస్తున్నారు. తన వ్యాపార ప్రయోజనాల కోసం ఏ దేశంపైకి అయినా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆయన కన్ను గ్రీన్ లాండ్ పై పడింది.

ప్రపంచ పటంలో అతిపెద్ద ద్వీపంగా ఉన్న గ్రీన్‌లాండ్ ప్రస్తుతం గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మంచు ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉండటం.. అందుకు డెన్మార్క్ ససేమిరా అనడం ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తోంది.

నగదు ప్రలోభం: ఒక్కొక్కరికి లక్ష డాలర్లు?

గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ట్రంప్ పరిపాలన ఒక వినూత్నమైన వివాదాస్పదమైన ఆలోచన చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. గ్రీన్‌లాండ్‌లో నివసించే సుమారు 57,000 మంది ప్రజలకు నేరుగా నగదు పంపిణీ చేయడం... ఇందుకోసం ఒక్కో పౌరుడికి 10 వేల డాలర్ల నుండి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేసి వారి సమ్మతితో అమెరికాలో విలీనం చేయడానికి చూస్తున్నాడు. తద్వారా డెన్మార్క్ అభ్యంతరాలను పక్కన పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ భూభాగాన్ని దక్కించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.

గ్రీన్‌లాండ్ ఎందుకు అంత ముఖ్యం?

అమెరికా గ్రీన్‌లాండ్‌పై ఇంత ఆసక్తి చూపడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.. మంచు కింద అపారమైన సహజ వనరులు, అరుదైన ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇక ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికాకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అక్కడ అమెరికాకు చెందిన 'తులే' వైమానిక స్థావరం ఉంది.

ముందు కాల్పులు.. తర్వాతే చర్చలంటున్న డెన్మార్క్ కఠిన వైఖరి..

అమెరికా ప్రతిపాదనలపై డెన్మార్క్ ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని తేల్చి చెప్పడమే కాకుండా తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించింది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నియమావళిని గుర్తు చేస్తూ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత తలెత్తితే ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాతే మాట్లాడండి అని డెన్మార్క్ రక్షణ శాఖ తన సైనికులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. మా స్వేచ్ఛను దేశాన్ని డాలర్లతో కొనలేరు అని ఆమె స్పష్టం చేశారు.

అంతర్జాతీయ చట్టాల కంటే జాతీయ భద్రతే ముఖ్యం

ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. అంతర్జాతీయ చట్టాల కంటే అమెరికా జాతీయ భద్రత, తన సొంత నైతిక విలువలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొనడం నాటో దేశాల్లో కలవరం సృష్టిస్తోంది. ఒక మిత్రదేశమైన డెన్మార్క్ భూభాగాన్ని బలవంతంగా లేదా ప్రలోభాలతో తీసుకోవాలని చూడటం కూటమిలో చీలికలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డాలర్ల ప్రవాహంతో ఒక దేశ భవిష్యత్తును మార్చడం ఆధునిక ప్రజాస్వామ్యంలో సాధ్యమేనా? ట్రంప్ వ్యాపార ధోరణి రాజకీయాలు గ్రీన్‌లాండ్ విషయంలో ఫలిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి మాత్రం ఆర్కిటిక్ మంచు కంటే ఎక్కువగా ఈ రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది.