Begin typing your search above and press return to search.

'ఇడియట్‌'.. ఓ ట్రంప్‌ గారి గూగుల్‌ ఇమేజెస్‌ వివాదం

పిచాయ్ తన వివరణలో గూగుల్‌ సెర్చ్‌ విధానంలో ఎలాంటి మానవీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. "యూజర్లు ఒక పదాన్ని టైప్‌ చేసినప్పుడు, ఆ కీవర్డ్‌ను బిలియన్ల పేజీలతో పోల్చి చూస్తాం.

By:  A.N.Kumar   |   26 Sept 2025 3:00 AM IST
ఇడియట్‌.. ఓ ట్రంప్‌ గారి గూగుల్‌ ఇమేజెస్‌  వివాదం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన తన రాజకీయ నిర్ణయాల వల్లనో లేదా వివాదాస్పద వ్యాఖ్యల వల్లనో కాదు, ఏకంగా గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల కారణంగా.. గూగుల్‌లో "ఇడియట్‌" అని సెర్చ్‌ చేస్తే, ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలు కనిపించడం అమెరికాలో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటన కేవలం ఒక సాంకేతిక లోపం కాదని, ఇంటర్నెట్‌ ట్రెండ్‌లు, వినియోగదారుల ప్రవర్తన ఎంత శక్తివంతమైనవో మరోసారి నిరూపించింది.

యూఎస్‌ హౌస్‌ కమిటీ విచారణ: పిచాయ్‌ వివరణ

గూగుల్ సెర్చ్‌లో వచ్చిన ఈ అసాధారణ ఫలితాలపై అమెరికన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఒక అధ్యక్షుడి పేరుతో ఇలాంటి ఫలితాలు రావడంపై హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఈ విచారణకు గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ హాజరై వివరణ ఇచ్చారు.

పిచాయ్ తన వివరణలో గూగుల్‌ సెర్చ్‌ విధానంలో ఎలాంటి మానవీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. "యూజర్లు ఒక పదాన్ని టైప్‌ చేసినప్పుడు, ఆ కీవర్డ్‌ను బిలియన్ల పేజీలతో పోల్చి చూస్తాం. తద్వారా తాజాగా ఉన్న .. ఎక్కువ ప్రజాదరణ పొందిన కంటెంట్‌ను యూజర్లకు అందిస్తాం. ఈ మొత్తం ప్రక్రియ యూజర్ల ప్రవర్తన, ఇంటర్నెట్‌ ట్రెండ్స్‌ ఆధారంగా అల్గారిథమ్‌ ద్వారా జరుగుతుంది. సెర్చ్‌ ఫలితాలను మాన్యువల్‌గా మార్చే అధికారం గానీ, విధానం గానీ గూగుల్‌కు లేదు" అని ఆయన తెలిపారు.

*"గూగుల్ బాంబింగ్‌" అంటే ఏమిటి?

"ఇడియట్‌" అని సెర్చ్‌ చేస్తే ట్రంప్‌ ఫొటోలు కనిపించడాన్ని సాంకేతికంగా "గూగుల్ బాంబింగ్‌" అని పిలుస్తారు. దీని అర్థం: ఇంటర్నెట్‌లో ఒక నిర్దిష్ట పదాన్ని ఉదాహరణకు ఇడియట్‌ ఒక నిర్దిష్ట పేజీ లేదా వ్యక్తితో తరచుగా లింక్ చేయడం ద్వారా సెర్చ్‌ ఫలితాలను ప్రభావితం చేయడం.

రాజకీయ పక్షపాతం వల్ల ఈ ఫలితం రాలేదని, కానీ వినియోగదారులు ఆన్‌లైన్‌లో పదేపదే చేసిన చర్యలు.. ట్రెండ్స్‌ కారణంగానే ఇలా జరిగిందని సుందర్ పిచాయ్‌ కమిటీకి తెలిపారు. ఇదంతా యూజర్ కంటెంట్, లింకులు, ఇంటర్నెట్‌లో ఆ పదబంధం ఎంత తరచుగా ప్రస్తావించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అంతర్జాతీయ చర్చాంశంగా వివాదం

ఒక దేశాధ్యక్షుడి పట్ల సెర్చ్‌ ఇంజిన్ ఫలితాలు ఈ విధంగా ఉండటం అమెరికాలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ సీఈఓ పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇవ్వాల్సి రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొత్తంగా "ట్రంప్‌ ఓ ఇడియట్‌" వివాదం గూగుల్‌ వంటి ఆధునిక అల్గారిథమ్‌ల శక్తిని మరోసారి నిరూపించింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ట్రెండ్స్‌ ఒక వ్యక్తి లేదా అంశం యొక్క ప్రతిష్టను ఎంత వేగంగా, ఎంత బలంగా ప్రభావితం చేయగలవో ఈ సంఘటన స్పష్టం చేసింది. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సామూహిక ప్రవర్తనే సెర్చ్‌ ఫలితాలకు "రాజ్యం"గా నిలుస్తుందని ఈ సంఘటన తేటతెల్లం చేసింది.