Begin typing your search above and press return to search.

పో పోవయ్యా ట్రంప్.. నీ గోల్డ్ కార్డ్ ఎవడికి కావాలి?

ఈ గోల్డ్ కార్డ్ ను అమెరికాలో నివాస హక్కు కోసం ఒక సూపర్ ప్రీమియం షార్ట్ కట్ గా ట్రంప్ ప్రదర్శిస్తున్నారు.

By:  A.N.Kumar   |   13 Dec 2025 8:00 PM IST
పో పోవయ్యా ట్రంప్.. నీ గోల్డ్ కార్డ్ ఎవడికి కావాలి?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ ప్రారంభమైంది. మిలియన్ డాలర్లు పెడితే ఎవరికైనా ఇది ఇచ్చేస్తారు. గోల్డ్ కార్డ్ తో అమెరికాలో స్థిరపడాలనుకునే ధనవంతులకు ఇదో సువర్ణావకాశం.. ఏప్రిల్ 3న ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ప్రకటించిన ‘గోల్డ్ కార్డ్’ పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన ముఖచిత్రం, సంతకం, ‘ది ట్రంప్ కార్డ్’ అనే పదాలతో రూపొందించిన ఈ లగ్జరీ కార్డును ప్రదర్శిస్తూ ‘నేనే మొదటి కొనుగోలుదారి.. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే ఇది మీదవుతుంది. ఎంత ఎగ్జైటింగ్ ఉంది కదా?’ అంటూ ప్రకటించడం అప్పట్లో పెను సంచలనమైంది. ఈ ఆకర్షనీయమైన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను ఆకర్షించేలా ఉన్నా ముఖ్యంగా భారతీయులకు ఈ గోల్డ్ కార్డ్ నిజంగా ఉపయోగపడుతుందా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి?

ఈ గోల్డ్ కార్డ్ ను అమెరికాలో నివాస హక్కు కోసం ఒక సూపర్ ప్రీమియం షార్ట్ కట్ గా ట్రంప్ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా విధానానికి ప్రత్యామ్మాయంగా మరింత వేగవంతమైన మార్గంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్డ్ వల్ల అమెరికా రెసిడెన్సీ త్వరగా లబిస్తుంది. బ్యూరోక్రసీ తక్కువగా ఉంటుంది. ధనవంతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈ హామీలన్నీ ఎన్నికల ప్రచార మాటల వరకే నన్న ప్రచారం సాగుతోంది.

క్యూలోనే భారతీయులు?

అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో భారతీయులకు ఇప్పటికే భారీ బ్యాక్ లాగ్ ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల విషయంలో కొన్ని దశాబ్ధాల పాటు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ గోల్డ్ కార్డ్ వచ్చినా కూడా భారతీయులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు తొలగిపోతాయా? అంటే స్పష్టత కరువైంది.

ప్రధాన సందేహాలు ఇవే..

అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం.. ఏ దేశానికి చెందిన వారికైనా గ్రీన్ కార్డులలో ఒక నిర్ధిష్ట శాతం మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కోటా కొనసాగితే 5 మిలియన్ డాలర్లు చెల్లించినా భారతీయులకు మినహాయింపు ఉండకపోవచ్చు. ఇది కేవలం ట్రంప్ రాజకీయ/ఎన్నికల ప్రచార స్టంట్ మాత్రమేనా? లేక చట్టసభ ఆమోదించిన పూర్తి స్థాయి చట్టబద్ద విధానమా? అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇంత పెద్దమొత్తం చెల్లించినా.. బ్యూరో క్రసీలో చిక్కుకోకుండా తక్షణమే రెసిడెన్సీ వస్తుందనే లిఖితపూర్వక హామీ ఇప్పటికైతే లేదు. అంటేఇది ఎంత ధనవుంతులైనా.. ఈ గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసినా కూడా భారతీయ వలసదారులు అదే పొడవైన క్యూలో నిలబడాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తవచ్చు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంవత్సరాలుగా సేవలందిస్తున్న భారతీయ టెక్ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలకు ఇది వాస్తవ పరిష్కారం కంటే ఒకఖరీదైన ఆడంబరమైన ఆలోచనగా మారుతోంది. చట్టపరమైన హామీలు , కోటాల మినహాయింపులు, స్పష్టమైన టైమ్ లైన్ లేకపోతే భారతీయులకు ఇది మరొక ఖరీదైన ఆశ మాత్రమే కావచ్చు.

ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆలోచన వినడానికి బంగారు కలలా ఉన్నా అమెరికన్ డ్రీమ్ వైపు భారతీయుల ప్రయాణంలో వారి వెయిటింగ్ లిస్ట్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అందుకే కొందరు భారతీయ నిపుణులు.. ‘పో పోవయ్యా ట్రంప్.. నీ గోల్డ్ కార్డ్ ఎవడికి కావాలి’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.