మిలియన్-డాలర్ షార్ట్‌కట్: ట్రంప్ గోల్డ్ కార్డ్ మొదలైంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గోల్డ్ కార్డ్’ పథకం ప్రారంభమైంది.
By: A.N.Kumar | 11 Dec 2025 11:49 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గోల్డ్ కార్డ్’ పథకం ప్రారంభమైంది. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు, విద్యార్థులను దేశంలోనే నిలుపుకోవడానికి కొత్త ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’ కార్యక్రమాన్ని అప్పట్లో ప్రకటించారు. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి టాప్ ర్యాంకులతో గ్రాడ్యూయేట్ అయినా.. ప్రస్తుత వ్యవస్థ వారిని దేశంలో కొనసాగించేందుకు హామీ ఇవ్వడం లేదు. దీంతో వారి కోసం హైర్ చేసుకోవాలనుకునే వారికి ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ ఒక వరంలా మారింది.
వైట్ హౌస్ లో టెక్ దిగ్గజ సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ కార్డ్ తో అమెరికన్ కంపెనీలు చక్కటి నైపుణ్యం ఉన్న విదేశీ గ్రాడ్యూయేట్లను ఎటువంటి ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి లేకుండా నియమించుకునే అవకాశముంటుందని చెప్పారు. వ్యక్తులు 1 మిలియన్ డాలర్లను చెల్లించి అమెరికాలో స్థిరపడొచ్చు. ఇక కంపెనీలు అయితే 2 మిలియన్ డాలర్లు చెల్లించి గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయవచ్చు. కంపెనీల కార్డ్ తో ఉద్యోగులకు కఠినమైన వెట్టింగ్ జరుగుతుంది. ఆమోదం పొందిన తర్వాత వారికి ఐదేళ్లలో పౌరసత్వం పొందే మార్గం ఉంటుంది. కార్డ్ హోల్డర్ ను మార్చుకునే సౌకర్యం కూడా ఉండడంతో కంపెనీలు అవసరానికి అనుగుణంగా ఇతర ఉద్యోగులను కూడా దీని కింద రోటేట్ చేయగలవు.
ఈ కొత్త వ్యవస్థ అమెరికాకు భారీ ఆదాయం తీసుకువస్తుందని ట్రంప్ పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా అమెరికా వీసా అనిశ్చితి కారణంగా కెనడా వంటి దేశాలకు ఉద్యోగులను పంపాల్సి వచ్చేది. కానీ ఈ కార్యక్రమం ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నారు.
డెల్, ఐబీఎం, క్వాల్ కామ్ వంటి గ్లోబల్ టెక్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో అమెరికా ఏఐ, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న లక్ష్యంపై ట్రంప్ దృష్టి సారించారు.
ఈ గోల్డ్ కార్డ్ పథకం భారత విద్యార్థులు, టెక్ ప్రొఫెషనల్స్ పై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఎందుకంటే అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు భారీగా ఉన్నారు. అలాగే హెచ్1బీ వీసాలలో కూడా మెజారిటీ భారతీయులే..
వీసా లాటరీలు, పరిమిత కోటాల వల్ల ఏర్పడుతున్న పోటీ సమస్యలను పరిష్కరిస్తూ గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించాలనే అమెరికా ప్రయత్నంలో ‘ట్రంప్ గోల్డ్ కార్డ్’ కీలక అడుగుగా భావిస్తున్నారు.
