మొండోడికి అడ్డేది? సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ట్రంప్ టారిఫ్ 'వార్'
భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ట్రంప్ తాజా నిర్ణయం భారత ఎగుమతులపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
By: A.N.Kumar | 22 Feb 2026 11:51 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల్లో 'తగ్గేదేలే' అంటున్నారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, దేశీయ న్యాయస్థానాల ఆదేశాల కంటే 'అమెరికా ఫస్ట్' పాలసీయే మిన్న అని ఆయన మరోసారి నిరూపించారు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ వాణిజ్య యవనికపై సంచలనం సృష్టించారు. అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ గ్లోబల్ టారిఫ్స్‌ను 10% నుండి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కోర్టు తీర్పు.. ట్రంప్ రివర్స్ ఎటాక్
ఇటీవల అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ విధించిన టారిఫ్స్‌ను అమెరికా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. టారిఫ్స్ విధించే అధికారం కాంగ్రెస్‌కు పార్లమెంటు ఉంటుందని, అధ్యక్షుడికి లేదని 6-3 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తీవ్రంగా మండిపడ్డ ట్రంప్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను "దేశభక్తి లేనివారు" అని విమర్శించారు.కోర్టు తీర్పుతో వెనక్కి తగ్గకుండా, 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ప్రయోగించారు. దీని ప్రకారం దేశ ఆర్థిక లోటును తగ్గించేందుకు అధ్యక్షుడు 150 రోజుల పాటు గరిష్టంగా 15% టారిఫ్స్ విధించవచ్చు.
10% కాదు.. 15%: గంటల వ్యవధిలో మార్పు
శుక్రవారం సాయంత్రం 10% టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ శనివారం నాటికి దానిని 15 శాతానికి పెంచుతూ నిర్ణయం మార్చుకున్నారు. "దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి.. ఇకపై అది సాగదు" అని ట్రూత్ సోషల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారత్‌పై ప్రభావం: ముప్పు ఉన్నా.. వెసులుబాటు ఉందా?
భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ట్రంప్ తాజా నిర్ణయం భారత ఎగుమతులపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత ఐటీ రంగానికి కొంత ఊరట ఉన్నప్పటికీ ఫార్మా రంగంపై నిఘా పెరిగే అవకాశం ఉంది. అయితే కీలకమైన మందులకు మినహాయింపులు లభించవచ్చు. దుస్తులు, ఆభరణాలు, హస్తకళల వంటి రంగాలపై 15% అదనపు భారం పడితే భారత ఎగుమతిదారులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ ఇప్పటికే అమెరికాతో ప్రత్యేక వాణిజ్య చర్చలు జరిపింది. సుమారు 18% టారిఫ్ రేటు వద్ద భారత్ ఒక ఒప్పందానికి వచ్చింది.. ఇతర ఆసియా దేశాల చైనా, వియత్నాం కంటే భారత్‌కు కొంత తక్కువ సుంకాలు పడ్డాయి.
ప్రపంచ దేశాల స్పందన
ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా వంటి మిత్రదేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. "ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విషం లాంటిది" అని జర్మనీ ప్రతినిధులు వ్యాఖ్యానించగా ఫ్రాన్స్ 'ప్రతీకార చర్యలకు' సిద్ధమని హెచ్చరించింది.
ట్రేడ్ వార్ మళ్లీ మొదలైనట్టేనా?
ట్రంప్ తాజా నిర్ణయం కేవలం 150 రోజులకు మాత్రమే పరిమితం కావచ్చు (చట్టప్రకారం). కానీ, ఈ లోపు ఆయన కాంగ్రెస్ నుండి శాశ్వత అనుమతి పొందేందుకు లేదా ఇతర దేశాలను చర్చల మేజా దగ్గరకు రప్పించేందుకు దీనిని ఒక బలమైన 'బేరసారాల అస్త్రం'గా వాడుతున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
