డోనాల్డ్ ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఉద్యోగి.. వెంటనే ఉద్యోగం నుండి తొలగించేశారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన దూకుడు స్వభావానికి నిదర్శనంగా నిలిచే మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు.
By: A.N.Kumar | 15 Jan 2026 12:57 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన దూకుడు స్వభావానికి నిదర్శనంగా నిలిచే మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. మిచిగన్‌లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్లాంట్‌ను సందర్శించిన సమయంలో ఒక ఉద్యోగి చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన ట్రంప్ అతనికి మధ్యవేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.
అసలేం జరిగింది?
మంగళవారం ట్రంప్ డీర్‌బార్న్‌లోని ఫోర్డ్ 'రివర్ రూజ్' కాంప్లెక్స్‌ను సందర్శించారు. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సాగిన ఈ పర్యటనలో ప్లాంట్‌లోని పై అంతస్తు పై ట్రంప్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో కింద పనిచేస్తున్న టి.జె. సాబులా (40) అనే లైన్ వర్కర్, ట్రంప్‌ను ఉద్దేశించి గట్టిగా "పెడోఫైల్ ప్రొటెక్టర్!" అంటూ అరిచాడు. జేమ్స్ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయడంలో ట్రంప్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ట్రంప్ రియాక్షన్.. వైరల్ వీడియో
ఉద్యోగి మాటలకు ఒక్కసారిగా షాక్ తిన్న ట్రంప్ వెంటనే ఆగిపోయి సదరు ఉద్యోగి వైపు వేలు చూపిస్తూ "ఫ%$క్ యూ" అని రెండుసార్లు అనడమే కాకుండా మధ్యవేలు చూపిస్తూ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఈ మొత్తం దృశ్యాలను అక్కడి వారు కెమెరాలో బంధించడంతో అది కాస్తా అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
క్షణాల్లో ఊడిన ఉద్యోగం
దేశాధ్యక్షుడిని అందరి ముందూ అవమానించాడనే కారణంతో ఫోర్డ్ యాజమాన్యం ఆ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన కొద్ది సేపటికే అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఫోర్డ్ సంస్థ స్పందన
మా సంస్థలో పని ప్రదేశంలో పరస్పర గౌరవం అనేది అత్యంత ముఖ్యం. ఎవరైనా సరే మర్యాద తప్పి ప్రవర్తిస్తే సహించేది లేదు. ఆ ఉద్యోగి వ్యాఖ్యలు మా నిబంధనలకు విరుద్ధం అని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
పశ్చాత్తాపం లేదన్న ఉద్యోగి
ఉద్యోగం కోల్పోయినప్పటికీ టి.జె. సాబులా తన చర్యను సమర్థించుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ "నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. జీవితంలో ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. ఒక అధ్యక్షుడిని నేరుగా ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు. నేను అదే చేశాను. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను తొలగించారు" అని పేర్కొన్నాడు.
రాజకీయ దుమారం
ఈ ఘటనపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశాధ్యక్షుడి స్థాయిలో ఉండి అలాంటి అసభ్యకరమైన సైగలు చేయడం తగదని డెమొక్రాట్లు విమర్శిస్తుండగా "పిచ్చివాడిలా ప్రవర్తించిన వ్యక్తికి అధ్యక్షుడు సరైన సమాధానమే ఇచ్చారు" అని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చాంగ్ సమర్థించుకున్నారు.
మొత్తానికి ఒక నిమిషం పాటు సాగిన ఈ 'ట్రోలింగ్' డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో మరో వివాదాన్ని చేర్చగా సదరు ఉద్యోగిని నిరుద్యోగిని చేసింది.
