వందేళ్ల క్రితం నాటి సీన్ ను రిపీట్ చేసిన ట్రంప్
ప్రపంచంలో ఇంత మంది దేశాధినేతలు.. దేశాధ్యక్షులు ఉన్నా.. వారిలో కొందరు దేశాలతో సంబంధం లేకుండా పాపులర్ అవుతుంటారు.
By: Garuda Media | 6 Oct 2025 10:00 AM ISTప్రపంచంలో ఇంత మంది దేశాధినేతలు.. దేశాధ్యక్షులు ఉన్నా.. వారిలో కొందరు దేశాలతో సంబంధం లేకుండా పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో అత్యధికులు మంచి కంటే కూడా విపరీత తీరుతోనే అందరిని ఆకర్షిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట నానుతూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి నిమిషం ఖాళీ లేకుండా అదే పనిగా సంచలన నిర్ణయాలు తీసుకోవటం.. తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
ఇప్పటివరకు ఎన్నో సంచలన నిర్ణయాల్ని తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు ఒక డాలర్ నాణెం మీద ట్రంప్ తన ముఖంతో కూడిన కరెన్సీని ప్రింట్ చేసేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా... దీనికి సంబంధించిన నమూనా విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అమెరికా 250వ స్వాతంత్య్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని నాణెన్ని తీసుకురావాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రం ఉన్న నాణెన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ నాణెన్ని ముద్రించాలని డిసైడ్ చేశారు.
అయితే..తాజాగా విడుదల చేసిన నమూనా మాదిరే ఉంటుందా? మార్పులు చోటు చేసుకుంటాయా? అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి. ఇటీవల విడుదలైన ట్రంప్ ముఖంతో కూడిన నాణెం నకలు నకిలీగా భావించారు. కానీ.. ట్రంప్ ఫేస్ తో ఒక డాలర్ నాణెన్ని తీసుకు వస్తున్నట్లుగా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొనటంతో.. అందరూ ఇప్పుడు ట్రంప్ ముఖంతో ఉండే నాణెం గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఈ నాణెం కింది భాగంలో మనం నమ్మే దేవుడి సాక్షిగా అన్న పదాలు.. పై భాగంలో.. పోరాడు.. పోరాడు.. పోరాడు అన్న పదాలు ఉన్నాయి. మరోవైపు 1776-2026 సంవత్సరాల్ని ప్రింట్ చేయటం..దీనిపై ట్రంప్ ముఖం ఉండేలా సిద్ధం చేశారు.
అయితే.. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న నాణెన్ని తయారు చేస్తారా? మార్పులుచేస్తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడీ అంశం వివాదంగా మారుతోంది. అమెరికా చట్టాల ప్రకారం చూస్తే.. ప్రస్తుతం పదవిలో ఉన్నఅధ్యక్షుడి లేదంటే జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని ప్రింట్ చేయటం చట్టవిరుద్ధంగా పేర్కొంటున్నారు. మరణించిన రెండేళ్ల తర్వాతే ప్రింట్ చేసే వీలుందని చెబుతున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే సరిగ్గా వందేళ్ల క్రితం 1926లో అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన కాల్విన్ కూలిడ్జ్ పేరును ప్రస్తావిస్తున్నారు. అమెరికా దేశ చరిత్రలో పదవిలో ఉండగానే నాణెంపై ఆయన చోటు దక్కించుకున్న రికార్డు ఉంది. ట్రంప్ కారణంగా ఆ రికార్డు బ్రేక్ కానుంది. మొత్తంగా అమెరికా కరెన్సీపై తన బొమ్మ వేయించుకోవాలని తపిస్తున్న ట్రంప్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.కొసమెరుపు ఏమంటే.. సరిగ్గా వందేళ్ల తర్వాత అమెరికాలో సేమ్ సీన్ తెర మీదకు రావటం.
