నేను మోనార్క్ ని...అంతర్జాతీయ చట్టాలతో పనిలేదు...ట్రంప్ హూంకరింపు
వెనిజులా అధ్యక్షుడి నిర్బంధం తర్వాతా ట్రంప్ అడుగులు వేగంగా గ్రీన్ ల్యాండ్ వైపు పడుతున్నాయి. డెన్మార్క్ లో భాగమైన గ్రీన్ ల్యాండ్ ను ఎలాగైనా హస్తగతం చేసుకోడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
By: Tupaki Political Desk | 9 Jan 2026 5:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరీ మోనార్క్ లా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. అతని దుందుడుకు చర్యలు యూఎస్ ప్రజలకు హీరాయిక్ గా అనిపిస్తున్నాయేమో తెలీదు కానీ మిగిలిన ప్రపంచ దేశాలకు మాత్రం తలనొప్పిగా మారాయి. ఎప్పుడు ఏ దేశంపై ఎలా విరుచుకు పడతాడో అర్థం కానంత సంక్లిష్టంగా తయారైంది అతని పాలనా శైలి. ట్రంప్ 2.0 వెర్షన్ భయంకరంగా ఉంటోంది. అందుకు సాక్ష్యం తాజాగా వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మధురోని బేడీలు వేసి మరీ బంధించడం. ఇందుకు తను చెబుతున్న కారణాలను ప్రపంచ దేశాలు నమ్మడం లేదు. ఆ విషయం ట్రంప్ కు కూడా తెలుసు. కానీ మొండిగా ముందుకు వెళుతున్నారంటే...వెనిజులాను ఆక్రమించుకోవాలనే అని ఎవరికైనా అర్థమవుతుంది. వెనిజులా దేశంలో అపార చమురు నిక్షేపాలపై ట్రంప్ కన్ను పడింది. అందుకే ఆ దేశాధ్యక్షుణ్ని కుంటి సాకులతో నిర్బంధించి....అమెరికాను బేషరతుగా చమురు వ్యాపారంలో కీలక భాగస్వామిగా చేసుకోవాలని వెనిజులాకు కండిషన్ పెడుతున్నాడు.
వెనిజులా అధ్యక్షుడి నిర్బంధం తర్వాతా ట్రంప్ అడుగులు వేగంగా గ్రీన్ ల్యాండ్ వైపు పడుతున్నాయి. డెన్మార్క్ లో భాగమైన గ్రీన్ ల్యాండ్ ను ఎలాగైనా హస్తగతం చేసుకోడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. బెగ్ బారో అన్నట్లు ఆ ప్రాంత ప్రజలపై డాలర్లు విసిరికొట్టి మరీ గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునే కుటిలయత్నానికి తెరలేపాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నాడన్న వార్త భగ్గుమంటోంది. గ్రీన్ ల్యాండ్ అంటే ట్రంప్ కు అమితాసక్తి. 2019లో తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంలోనే గ్రీన్ ల్యాండ్ కొనుగోలుకు బేరసారాలాడాడు. అప్పట్లో ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ చేస్తే...డెన్మార్క్ ప్రభుత్వం దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన నేపథ్యంలో ట్రంప్ ఈసారి డెన్మార్క్ ప్రభుత్వానికి కాకుండా ఏకంగా ప్రజలకే ఎరవేసేందుకు సిద్దమయ్యాడు.
ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ద్వీపంలోని ప్రతి వ్యక్తికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల దాకా ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు వ్యూహం రచిస్తున్నాడు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు ఒకవేళ గ్రీన్ ల్యాండ్ ప్రజలు డాలర్ల వర్షానికి తడిసి మురిసిపోయేందుకు, తమ స్వేచ్చను అమ్ముకునేందుకు సిద్దమైతే మాత్రం ట్రంప్ గ్రీన్ ల్యాండ్ ను సునాయాసంగా స్వాధీనం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ట్రంప్ వేస్తున్న ఈ పాచికకు డెన్మార్క్ కంగుతింది. ఊహించని ఈ ఎత్తుగడకు కకావికలమవుతోంది. గ్రీన్ ల్యాండ్ వేరైతే ఏం చేయాలో డెన్మార్క్ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రత్యక్ష యుద్దంలో దిగితే అగ్రరాజ్యంతో ఆటలాడ్డం అంత ఆషామాషీ కాదని ఆందోళన చెందుతోంది.
ఉత్తర అమెరికా, యూరప్ మధ్యలో ఉన్న ఈ ద్వీపం సొంతమైతే అమెరికాకు యుద్ధవ్యూహాలు రచించడం మరింత సులువవుతుంది. అమెరికా సైన్యానికి ఇది వ్యూహాత్మక ప్రాంతమవుతుంది. ఇప్పటికే వాయవ్య గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరముంది. అరుదైన ఖనిజాలకు పుట్టినిల్లుగా ఉన్న గ్రీన్ ల్యాండ్ సొంతమైతే...ఖనిజాల కోసం చైనా పై ఆధారపడే అవస్థ తప్పుతుందని ట్రంప్ ఆలోచనని చాలా మంది అంటున్నారు. స్వయం పాలిత ప్రాంతంగా, డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్ ల్యాండ్ లో లక్షలోపు జనాభా ఉంది.
ఇప్పటికే ట్రంప్ కన్ను పలు దేశాలపై పడింది. ఎక్కడైనా సరే తమ పెత్తనం సాగాలన్న దురంహకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అసలు మీకు గ్లోబల్ పవర్స్ ఎవరిచ్చారు? ఏ దేశంపై అయినా సైనికచర్యలు తీసుకునే అధికారం మీకుందా అంటూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ను ప్రశ్నిస్తే....తన నైతికతే తనకున్న పరిమితి అని చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ చట్టాలతో తనకు పనిలేదని, ఏ దేశంలో ప్రజలు బాధపడ్డా తాను సహించబోనని అన్నాడు. పనిలో పనిగా గ్రీన్ ల్యాండ్ స్వాధీనం అమెరికాకు చాలా అవసరమని తెలిపాడు. బహుశా అమెరికా ప్రజల్లో చాలా మంది ఇలాంటి అధ్యక్షుణ్నే కోరుకుంటున్నారేమో...ఎందుకంటే ఓ విశ్లేషకుడు మాట్లాడుతూ...అమెరికా అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కావల్సిన అవసరం లేదు...బిజినెస్ డీల్ చేసేవాడైతే చాలు...అమెరికన్లకు కావల్సింది ప్రపంచ దేశాలను సమర్థంగా డీల్ చేయడమే అన్నారు. గ్రీన్ ల్యండ్, వెనిజులా వ్యవహారాలు చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తోంది.
