ట్రంప్ వారసుడిగా జేడీ వాన్స్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలోనే కాకుండా రిపబ్లికన్ పార్టీపై కూడా గాఢమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు.
By: A.N.Kumar | 7 Aug 2025 2:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలోనే కాకుండా రిపబ్లికన్ పార్టీపై కూడా గాఢమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. రిపబ్లికన్స్ భవిష్యత్తు విషయంలో పకడ్బందీ అడుగులు వేస్తున్నాడు. తాజాగా ట్రంప్ చేసిన ఒక కీలక వ్యాఖ్య రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు మార్గదర్శకత్వం ఎటు పోతుందో సూచిస్తున్నది.
తాజాగా విలేకరులతో మాట్లాడిన సమయంలో ట్రంప్.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను తన వారసుడిగా అభివర్ణించారు. “అవునయ్యా, చివరికి ఆయన ఉపాధ్యక్షుడే కదా” అంటూ మేగా (MAGA - Make America Great Again) ఉద్యమానికి తాను ఎంపిక చేసిన వారసుడిగా వాన్స్‌నే సూచించారనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.
- జేడీ వాన్స్.. యువ నాయకుడిగా ఎదుగుతున్న దారిలో...
వయస్సు కేవలం 40 సంవత్సరాలే అయినా జేడీ వాన్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక వైపు ఉపాధ్యక్షునిగా, మరోవైపు విదేశాంగ విధానాల పరంగా, ట్రంప్ విధానాలను మద్దతుగా నిలిచి, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో ఉన్న లోపాలపై ఆయన స్పష్టమైన విమర్శలు చేయడంలోనూ, ట్రంప్ విధానాల అమలులోనూ ఆయన అగ్రగామిగా నిలిచారు. ఇది రిపబ్లికన్ పార్టీ యువతలో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది.
- మార్కో రుబియో.. విదేశాంగంపై పట్టున్న కీలక నేత
విదేశాంగ , జాతీయ భద్రతా వ్యవహారాల్లో మార్కో రుబియో అత్యంత అనుభవం కలిగిన నేతగా కొనసాగుతున్నారు. ట్రంప్ పాలనలో ఆయనకు రెండు కీలక పదవులు – విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) , జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్) లు లభించాయి. హెన్రీ కిస్సింజర్ తర్వాత ఈ రెండు పదవులు నిర్వహించిన మొదటి వ్యక్తిగా రుబియో చరిత్ర సృష్టించారు. అతని గణనీయమైన అనుభవం, అంతర్జాతీయ మట్టంలో అమెరికా వైఖరిని సమర్థంగా సూచించగలిగే సామర్థ్యం, ఆయనను రిపబ్లికన్ పార్టీకి బలమైన నాయకుడిగా నిలబెట్టాయి.
- 2028: వాన్స్ - రుబియో కాంబినేషన్?
ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం, రిపబ్లికన్ పార్టీకి భవిష్యత్తులో ఒక సంయుక్త సారథ్యం కావాలంటే, వాన్స్ – రుబియో జంట బలమైన ఎంపిక అవుతుందని సంకేతాలివ్వడం జరిగింది. ఒకరు యువ నాయకుడు, జనవాణి వినగల ఉపాధ్యక్షుడు.. మరొకరు అనుభవజ్ఞుడైన విదేశాంగ నిపుణుడు. వీరిద్దరి మేళవింపు రిపబ్లికన్ పార్టీలో స్థిరత్వాన్ని, గణనీయమైన మార్పును తీసుకురావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
-ట్రంప్ మౌనమే ఆమోదం?
ట్రంప్ వాన్స్‌ను వారసుడిగా నేరుగా ప్రకటించలేదు కానీ, అతడిని "క్యాపిటల్ ఇండివ్యూజవల్" అని అభివర్ణించడం ద్వారా మౌనంగా తన అంగీకారాన్ని తెలిపారని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. 2028 ఎన్నికలు ఇంకా మూడు సంవత్సరాలు దూరంలో ఉన్నా, ట్రంప్ వంటి ప్రభావవంతమైన నాయకుడి మద్దతు ఎవరికైనా లభిస్తే అది రిపబ్లికన్ నామినేషన్‌పై గణనీయమైన ప్రభావం చూపించగలదు.
మొత్తానికి ట్రంప్ తాజా వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ పునర్నిర్మాణ దిశగా సాగుతున్న దశలను సూచిస్తున్నాయి. జేడీ వాన్స్ వంటి యువ నాయకులకు అవకాశం ఇవ్వాలన్న సంకేతం, రుబియో వంటి అనుభవజ్ఞులకు స్థానం కల్పించాలన్న దృష్టి ఇవి 2028 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎటు వెళ్తుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ట్రంప్ గారి నిశ్చల శబ్దం వెనక ఉన్న రాజకీయ వ్యూహాన్ని అందరు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
