Begin typing your search above and press return to search.

అమెరికాలో 'ఇన్ కమ్ ట్యాక్స్‌' పూర్తిగా రద్దు? ట్రంప్ మరో సంచలనం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ ఆర్థిక విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ల వ్యక్తిగత ఇంకమ్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.

By:  A.N.Kumar   |   29 Nov 2025 4:00 AM IST
అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్‌ పూర్తిగా రద్దు? ట్రంప్ మరో సంచలనం?
X

ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకే రోజు టారిఫ్ లు వేస్తున్నాడు. మరుసటిరోజే తీస్తున్నాడు. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అమెరికా సంసారం. టారిఫ్ లు, అస్తవ్యస్థ విధానాలతో అమెరికా ఆర్థిక వ్యవస్తను కుప్పకూలుస్తున్న ట్రంప్ ఇప్పుడు అమెరికన్ల కాలిన గాయాలకు యాంటిమెంట్ పేసే కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్నాడు. ఏకంగా అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ రద్దు దిశగా ఆలోచిస్తున్నాడు. ఈ మేరకు ప్రకటన కూడా చేయడం పెను సంచలనమైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ ఆర్థిక విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ల వ్యక్తిగత ఇంకమ్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్య వల్ల వచ్చే ఆదాయ లోటును టారిఫ్‌లు ద్వారా సమర్థవంతంగా భర్తీ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. సైనికులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ట్రంప్ "మరి కొన్నేళ్లలో ఇంకమ్ ట్యాక్స్‌ను చాలా తగ్గిస్తాం... లేదా పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టారిఫ్‌ల ద్వారా మనకి వచ్చే డబ్బు ఎంతో పెద్దది" అని తెలిపారు.

టారిఫ్‌ల ద్వారా భారీ ఆదాయం లక్ష్యం

ట్రంప్ మొదటిసారి ఈ అంశాన్ని ప్రస్తావించడం ఇదేం కాదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా సంవత్సరానికి $200,000 లోపు సంపాదన కలిగిన అమెరికన్లకు ఇంకమ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ అయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై 10% నుంచి 50% వరకు కొత్త ఇంపోర్టు పన్నులు ట్రంప్ విధించారు. ఈ భారీ టారిఫ్‌ల వల్ల ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ప్రోత్సాహం పెరిగి, దేశీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది. తద్వారా అమెరికాలో కొత్త ఫ్యాక్టరీలు, పరిశ్రమలు స్థాపింపబడతాయి.

పౌరులకు '$2,000 టారిఫ్ డివిడెండ్'

టారిఫ్‌లపై ఆర్థిక నిపుణుల నుండి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ లాభాలను సాధారణ ప్రజలకు చేరవేయడానికి ట్రంప్ ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి కనీసం $2,000 "టారిఫ్ డివిడెండ్" ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే అధిక ఆదాయం పొందేవారికి మాత్రం ఈ డివిడెండ్ వర్తించదని తెలిపారు. ప్రస్తుతం అమెరికా $37 ట్రిలియన్ భారీ జాతీయ రుణ భారాన్ని మోస్తోంది. ఈ టారిఫ్ ఆదాయం పెరగడం ద్వారా ప్రభుత్వం రుణాన్ని తక్కువ చేయగలదని, అదే సమయంలో పెట్టుబడులను పెంచగలదని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీం కోర్టులో టారిఫ్‌లపై చిక్కులు

ట్రంప్ ప్రణాళికలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటి అమలుకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో కొంతమంది న్యాయమూర్తులు టారిఫ్‌ల చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని కోర్టు తేలిస్తే ప్రభుత్వం $100 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని పన్నుదారులకు రీఫండ్ చేయాల్సి రావచ్చని తెలుస్తోంది. ట్రంప్ ఈ అసాధారణ ఆర్థిక ప్రతిపాదన అమెరికన్ రాజకీయాలు.. ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.