Begin typing your search above and press return to search.

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.

By:  A.N.Kumar   |   16 April 2026 7:55 PM IST
యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?
X

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైన్యాల మోహరింపు, క్షిపణుల ప్రయోగం మాత్రమే కాదని.. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా కూడా శత్రువును లొంగదీసుకోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు. ఇటీవల నెదర్లాండ్స్ రాజు కింగ్ విల్లెం-అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ సంభాషణలో ట్రంప్ వెల్లడించిన ‘ఆర్థిక ఒత్తిడి’ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రక్తపాతం లేని పరిష్కారం కోసం ఆయన వెతుకుతున్నారా లేక ఇరాన్‌ను ఆర్థికంగా ఉరి తీయాలని చూస్తున్నారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆర్థిక యుద్ధం: లక్ష్యం ఏమిటి?

ట్రంప్ వ్యూహం వెనుక స్పష్టమైన లెక్కలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై ప్రత్యక్ష సైనిక చర్య చేపడితే అది మధ్యప్రాచ్యం అంతటా కార్చిచ్చులా వ్యాపిస్తుందని, అమెరికాకు కూడా భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని ఆయనకు తెలుసు. అందుకే ‘మాగ్జిమమ్ ప్రెజర్’ అనే పాత మంత్రాన్ని ఆయన మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. చమురు ఎగుమతులపై ఉక్కుపాదం మోపడం ద్వారా ఇరాన్ ఖజానాను ఖాళీ చేయడం.. తద్వారా ఆ దేశం స్వచ్ఛందంగా చర్చల టేబుల్ వద్దకు వచ్చేలా చేయడం ఈ వ్యూహంలోని ప్రధానాంశం. ఇప్పటికే ఆంక్షల భారంతో సతమతమవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ‘చావు దెబ్బ’ వంటిదే.

హార్ముజ్ జలసంధి.. గ్లోబల్ ఎకానమీకి ప్రాణసంకటం

అయితే ఏ వ్యూహమైనా ఏకపక్షంగా సాగదు. అమెరికా ఆర్థికంగా ఇరాన్‌ను దిగ్బంధించాలని చూస్తుంటే ప్రతిస్పందనగా ఇరాన్ ప్రపంచ చమురు సరఫరా నాడి అయిన ‘హార్ముజ్ జలసంధి’ని లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న ఈ మార్గం మూతపడితే అది కేవలం ఇరాన్ సమస్యగా మిగలదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లు దాటిపోవడం ఖాయం. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీసి, దేశాల ఆర్థిక వృద్ధిని కుంటుపరుస్తుంది.

భారత్ ముంగిట సవాళ్లు

ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు భారతదేశం వంటి దేశాలకు అత్యంత ఆందోళనకరం. భారత్ తన చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యుడి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.దిగుమతుల బిల్లు పెరిగితే విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి, రూపాయి విలువ పడిపోతుంది.అటు అమెరికాతో సంబంధాలు, ఇటు ఇరాన్‌తో ఉన్న చారిత్రక బంధం మధ్య భారత్ సమతుల్యతను కాపాడుకోవడం కత్తిమీద సామే అవుతుంది.

ఆర్థిక ఆంక్షలు అనేవి ఒక శక్తివంతమైన దౌత్య ఆయుధాలు కావచ్చు.. కానీ అవి అమాయక ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయనేది చేదు నిజం. ట్రంప్ భావిస్తున్నట్లుగా ఆర్థిక ఒత్తిడి ఇరాన్‌ను చర్చలకు రప్పిస్తుందా? లేక ఆ దేశం మరింత దూకుడుగా మారి యుద్ధ మేఘాలను సాంద్రతరం చేస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదైనా సమస్యకు పరిష్కారం తుపాకీ గొట్టం ద్వారా కాకపోయినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలితీసుకునేలా ఉండకూడదు. అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్య ప్రపంచం నలిగిపోకుండా ఉండాలంటే విజ్ఞతతో కూడిన దౌత్యమే ఏకైక మార్గం.