Begin typing your search above and press return to search.

ఇరాన్ ను దారికి తెచ్చుకోలేక.. భారతీయ వ్యాపార సంస్థలపై అమెరికా కొరడా!

ఇరాన్‌పై మరింతగా ఆర్థిక ఆంక్షల ఒత్తిడిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   26 Aug 2026 12:16 PM IST
ఇరాన్ ను దారికి తెచ్చుకోలేక.. భారతీయ వ్యాపార సంస్థలపై అమెరికా కొరడా!
X

ఇరాన్‌పై మరింతగా ఆర్థిక ఆంక్షల ఒత్తిడిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మన దేశానికి నాలుగు వ్యాపార సంస్థలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 సంస్థలు, వ్యక్తులపై మంగళవారం నుంచి ఆర్థిక ఆంక్షలు విధించారు. ఆయా సంస్థలు ఇరాన్ తో వ్యాపారం చేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. సుమారు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో మన దేశానికి చెందిన నాలుగు సంస్థలు పాల్గొన్నాయనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధికారికంగా వెల్లడించింది.

అమెరికా ఆంక్షల జాబితాలో నిలిచిన భారతీయ కంపెనీలలో సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్ పేరు ఉండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ సంస్థ 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూన్ మధ్య కాలంలో సుమారు 69 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ముడి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ గుర్తించింది. అంతేకాకుండా, గతంలో అమెరికా ఆంక్షలకు గురైన 'బొంజోర్ కమోడిటీ FZE'తో ఈ సంస్థకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తోంది. వీటితో పాటు పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాకు, లాజిస్టిక్స్ సేవలకు సహకరించిందనే ఆరోపణలతో భారతీయ కస్టమ్స్ బ్రోకర్ సంస్థ 'పోర్టీజ్ పార్ట్‌నర్స్ LLP'పై కూడా ఆంక్షల వేటు పడింది.

ఈ నాలుగు సంస్థలతో పాటు ముగ్గురు వ్యక్తులను కూడా అమెరికా వ్యక్తిగతంగా ఈ ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. పీపీ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్‌తో పాటు, పోర్టీజ్ పార్ట్‌నర్స్ సంస్థకు చెందిన భాగస్వాములు ఇంద్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగిలాను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పందిస్తూ, తాజా చర్యలను 'ఆర్థిక డి-డే'గా అభివర్ణించారు. ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా ఏకాకిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, టెహ్రాన్‌తో ఆర్థిక లేదా వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, సంస్థయినా భారీ జరిమానాలు ఎదుర్కోక తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

మరోవైపు, అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు పూర్తిగా విరుద్ధమని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే స్పష్టం చేశారు. అమెరికా విధించే ఇటువంటి కఠిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ దేశం వద్ద పకడ్బందీగా రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉందని, వీటిని సమర్థంగా తిప్పికొడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ తాజా భౌగోళిక-రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల భవిష్యత్తులో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో సరఫరాకు ఏవైనా ఆటంకాలు ఏర్పడితే, ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగిన ఇతర దేశాలు, ముఖ్యంగా భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల విధింపు పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.