Begin typing your search above and press return to search.

ట్రంప్ లా డాన్స్ చేశాడు...అరెస్ట్ అయ్యాడు...

అయితే అమెరికా సైనిక చర్యల పట్ల వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో తీవ్రంగా స్పందించారు.

By:  Tupaki Political Desk   |   7 Jan 2026 6:07 PM IST
ట్రంప్ లా డాన్స్ చేశాడు...అరెస్ట్ అయ్యాడు...
X

ట్రంప్ ఏం చేసినా సంచలనమే...చివరాఖరికి డాన్స్ చేసినా...పాపం అది తెలీక... ఊరుకుండలేక ఉబ్బసానికి మందు తీసుకున్నట్లు వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ట్రంప్ డాన్స్ ను ఇమిటేట్ చేయడంతో...అగ్గిరాముడిలా మారిన ట్రంప్ నిర్దాక్షిణ్యంగా మధురోను బొక్కలో తోసేశాడు. ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టాపిక్ ఇదే. అంటే ట్రంప్ లో ఈ షేడ్ కూడా ఉందా? తన డాన్స్ ను ఇమిటేట్ చేస్తే ఎవడైనా సరే పట్టుకెళ్ళి లోపలేసేస్తాడా? అయ్యబాబోయ్...అనిపిస్తుంది కదా. సరే ట్రంప్ తెంపరితనం అటుంచితే తనకు డాన్స్ చేసే హాబీ మాత్రం ఉంది. అమెరికాలో జరిగే పలు ఆధికారిక కార్యక్రమాల్లో ట్రంప్ డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదే విషయంగా ట్రంప్ ఓ సమావేశంలో మాట్లాడుతూ...తన డాన్స్ అంటే అందరికీ ఇష్టం కానీ తన భార్య మెలానియాకు మాత్రం నచ్చదని అన్నారు. అంతే కాదు ఓ దేశ అధ్యక్షుడిగా ఈ గెంతులేంటి అని ఆక్షేపిస్తుంటుందని అన్నారు. అదేదో సినిమాలో విలన్ ఫ్లూట్ వాయిస్తూ అరాచకాలు చేస్తున్న సీన్లు మీకు గుర్తుకు రావట్లేదు.

ఇంతకూ వెనిజులా అధ్యక్షుడు మధురోను అంత పకడ్బందీగా బంధించి మరీ ట్రంప్ అంతకంతకు కసి తీర్చుకున్నాడా? లేదా ట్రంప్ ఈ చర్య చేపట్టింది సరైనదేనా? ట్రంప్ టార్గెట్లో ఇంకా ఏయే దేశాలున్నాయి? వాటి భరతం పడతాడా? ఎన్నో ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు ఇపుడు తరపైకి వస్తున్నాయి. వెనిజువెలాపై అమెరికా చేప‌ట్టిన‌ భారీ సైనిక చర్య ప్ర‌పంచాన్ని ఉలిక్కి ప‌డేలా చేసింది. గత శుక్రవారం అర్థరాత్రి దాటాక అమెరికా సైన్యం ఆకస్మికంగా బాంబులతో దాడులు చేసింది. ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ అనే కోడ్ నేమ్‌తో జరిగిన ఈ చర్యలతో కరాకస్ పరిసర ప్రాంతాలు తీవ్ర బాంబు పేలుళ్ళతో దద్దరిల్లాయి. సైనిక స్థావరాలు, కీలక భవనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కూడా అమెరికా సైన్యం నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మదురో దంపతులను యూఎస్ నేవీ యుద్ధ నౌక ద్వారా న్యూయార్క్‌కు తరలించారు. కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసిన ఫోటోలను విడుదల చేశారు.

అయితే అమెరికా సైనిక చర్యల పట్ల వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో తీవ్రంగా స్పందించారు. విదేశీ సైనిక దళాల దాడిని వెనిజువెలా అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అమెరికా అనుచిత దాడులు వల్ల పౌర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా చర్యలకు వెనిజులా వెనకడుగు వేయదని, చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. కాగా అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు మదురోనే నాయకుడని ట్రంప్‌ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంగా మదురోపై 2020లో న్యూయార్క్‌ దక్షిణ జిల్లాలో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి మధురో అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు.

అయితే మధురోను బంధించింది అందుకు కాదని కొన్ని వర్గాలు అంటున్నాయి. పైకి అతను డ్రగ్స్ సరఫరా చేశాడని ట్రంప్ ఆరోపిస్తున్నా....లోపాయికారిగా వెనిజులా చమురు నిల్వలపై కన్ను వేశాడని, అందుకే ఈ సైనిక చర్యలని అంటున్నారు. మధురో నిర్బంధం నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఆ దేశానికి మరో హుకూం జారీచేశాడు. వెనిజులా తక్షణం చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలి, ఆయిల్ ప్రొడక్షన్ లో అమెరికాను భాగస్వామిగా చేసుకోవాలని, అలాగే అమెరికాకు అధిక మొత్తంలో చమురు విక్రయించే సమయంలో సానుకూలంగా వ్యవహరిం చాలని ఆదేశించాడు. ప్రస్తుతం అమెరికాకు వెనిజులా 30 మిలియన్ల బ్యారెళ్ళ చమురు విక్రయిస్తుండగా... దాన్ని 50 మిలియన్ల బ్యారెళ్ళకు పెంచి మార్కెట్ ధరలకు విక్రయించాలని తెలిపారు.

ఏది ఏమైనా వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మధురో ట్రంప్ డాన్స్ ను ఇమిటేట్ చేయకుండా ఉండాల్సింది. తమాషా చేసేందుకు పోతే అమాస అయినట్లు పాపం ఏదో ట్రంప్ లా కాలు కదిపినందుకు కటకటాల పాలు కావల్సి వచ్చింది హతవిధీ....