జీవితంలో ఒక్కసారైనా నవ్వావా.. విలేకరిపై ట్రంప్ ఆగ్రహం
తనకు నచ్చని ప్రశ్నలు వేస్తే ట్రంప్ కు అరికాల్లో మండుతుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం గురించి తాజాగా విడుదలైన పత్రాల గురించి విలేకరి ప్రశ్నించడం ట్రంప్ కు మింగుడు పడలేదు.
By: A.N.Kumar | 4 Feb 2026 7:00 PM ISTతనకు నచ్చని ప్రశ్నలు వేస్తే ట్రంప్ కు అరికాల్లో మండుతుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం గురించి తాజాగా విడుదలైన పత్రాల గురించి విలేకరి ప్రశ్నించడం ట్రంప్ కు మింగుడు పడలేదు. దీంతో సీఎన్ఎన్ ఛానల్ విలేకరి కైట్లాన్ కొల్లిన్స్ పై విరుచుకుపడ్డారు. చెత్త రిపోర్టర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదేళ్లుగా చూస్తున్నానని, ఒక్కసారి కూడా నవ్వినట్టు చూడలేదని ఆమెను ట్రంప్ అన్నారు. మీలాంటి వాళ్ల వల్లే సీఎన్ఎన్ ఛానల్ రేటింగ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు. మీరు ఎప్పుడు నిజాలు చెప్పరని, అందుకే ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని ట్రంప్ అన్నారు. ఎప్ స్టీన్స్ ఫైల్స్ లో తనతోపాటు ఇతర పేర్లను కుట్రపూరితంగా ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలపై కాకుండా దేశం గురించి ఆలోచిస్తే మంచిదని ఆమెకు ట్రంప్ హితవు పలికారు.
ఎప్ స్టీన్స్ సెక్స్ కుంభకోణం గురించి అమెరికా న్యాయ శాఖ కొన్ని పత్రాలను విడుదల చేసింది. అందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, మైకేల్ జాక్సన్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, బిల్ గేట్స్ పేర్లు, ఫోటోలు ఉన్నాయి. కానీ ట్రంప్ ఫోటోలు, పేరు లేవు. ఈ విషయాన్నే విలేకరి కైట్లాన్ కొల్లిన్స్ అడిగారు. దీంతో ఆమెపై ట్రంప్ ఒంటికాలితో లేచారు.
ఎప్ స్టీన్స్ సెక్స్ కుంభకోణం..
ఎప్ స్టీన్ అమెరికాలో పెద్ద ఫైనాన్షియర్. సెక్స్ నేరాల అభియోగాలతో ఎప్ స్టీన్ పేరు 2006లో వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులతో ఎప్ స్టీన్ కు పరిచయాలు ఉండటం, పెద్ద ఫైనాన్షియర్ కావడంతో ఎప్ స్టీన్ కేసుపై మీడియా దృష్టి పెట్టింది. ఎప్ స్టీన్ బడా నాయకుల్ని, వ్యాపార వేత్తల్ని తన వలలో వేసుకోవడానికి, అమ్మాయిలను ఎరగా వేసి, భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ కోసం ఆ వీడియోలు చిత్రీకరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలిక కేసులో చిక్కుకోవడంతో ఎప్ స్టీన్ అరెస్టయ్యారు. కానీ 13 నెలల శిక్ష తర్వాత విడుదలయ్యారు. ఆ తర్వాత 2019లో మైనర్ బాలికలతో సెక్స్ రాకెట్ విషయంలో మరోసారి పట్టుబడ్డాడు. విచారణ సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే అది ఆత్మహత్య కాదు. హత్య అని చాలా మంది ఆరోపిస్తున్నారు. పెద్ద తలకాయల గుట్టు ఎప్ స్టీన్ వద్ద ఉంది. అందుకే అతడిని హతమార్చారని కొందరు ఆరోపిస్తున్నారు . ట్రంప్ కూడా తాను అధికారంలోకి వచ్చాక ఎప్ స్టీన్ కుంభకోణం వెలుగులోకి తీసుకొస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు దాంతో అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యకరం. దీంట్లో ట్రంప్ కూడా ఉన్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే విలేకరులు ట్రంప్ ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
