Begin typing your search above and press return to search.

నువ్వో చెత్త రిపోర్టర్ వి.. ట్రంప్ అన్న ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఇక్కడ అసలు విషయం ఏమంటే.. ట్రంప్ ను ఆమె పలు ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించటమే. అందులో ముఖ్యమైనవి.. ‘‘తాజాగా విడుదలైన పేజీల్లో చాలా వరకు సవరించారు.

By:  Garuda Media   |   4 Feb 2026 10:30 PM IST
నువ్వో చెత్త రిపోర్టర్ వి..  ట్రంప్ అన్న ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
X

అసలే ట్రంప్. ఆ పై కోపం వస్తే? అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న ఆయన్ను ఇరుకున పెట్టేలా.. ఇబ్బందికి గురి చేసేలా ప్రశ్నలు ఎవరు అడిగినా.. వారి మీద ఎంతలా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో తనను చిరాకు పెడుతున్న సీఎన్ఎన్ చానల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించటమే కాదు.. ట్రంప్ కు కోపం వస్తే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా మారాయని చెప్పొచ్చు. గడిచిన కొంతకాలంగా ట్రంప్ ప్రభుత్వాన్ని ఎప్ స్టీన్ సెక్స్ స్కాం చికాకు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఈ కుంభకోణానికి సంబంధించి కొత్తగా విడుదలైన పత్రాల గురించి సీఎన్ఎన్ చానల్ కు చెందిన ప్రముఖ రిపోర్టర్ కైట్లాన్ కొల్లిన్స్ ట్రంప్ ను సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యకతం చేస్తూ.. ‘‘నువ్వో చెత్త రిపోర్టర్ వి. నేను పదేళ్లుగా చూస్తున్నాను. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నవ్వినట్లు చూడలేదు మీలాంటి వాళ్ల వల్లే సీఎన్ఎన్ చానల్ రేటింగ్ పడిపోతుంది మీరెప్పుడై నిజాలు చెప్పరని మీకు బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో నాతో సహా ఇతరుల పేర్లను కుట్రపూరితంగా విడుదల చేశారు. ఇప్పుడు ఇలాంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే అందరికి మంచిది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక్కడ అసలు విషయం ఏమంటే.. ట్రంప్ ను ఆమె పలు ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించటమే. అందులో ముఖ్యమైనవి.. ‘‘తాజాగా విడుదలైన పేజీల్లో చాలా వరకు సవరించారు. ఈ విషయంలో బాధితులు అసంతృప్తిగా ఉన్నారు. మీ ప్రభుతవం మరింత పారదర్శకంగా ఉండాలి. న్యాయం జరగలేదని భావిస్తున్న ఎప్ స్టీన్ బాధితులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ ఫైల్స్ లో మీ సన్నిహితులైన ఇలాన్ మస్క్, హోవార్డ్ లుట్నిక్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. వాటిని మీరు చదివారా? ఎప్ స్టీన్ తో సంబంధాలతో రాజీనామా చేసిన బ్రిటిష్ రాయబారి పీటర్ మాండెల్స్ సంగతేంటి?’’ లాంటి మంట పుట్టే ప్రశ్నలు అడగటంతో ట్రంప్ కోపం నశాళానికి అంటింది. అంతే.. నువ్వో చెత్త రిపోర్టర్ వి అంటూ ఇష్యూను డైవర్ట్ చేసేలా వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రిపోర్టర్ కైట్లాన్ కొల్లిన్స్ పెద్దగా స్పందించలేదు. అదే సమయంలో ఆమె నవ్వలేదు కూడా. తన ప్రశ్నల పరంపరను ఆపలేదు. దీంతో.. ఈ మీడియా సమావేశం ముగిసిన తర్వాత కూడా ట్రంప్.. ఆమె ఎప్పుడూ నవ్వదన్న మాటలు రికార్డు అయ్యాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో కైట్లాన్ కొల్లిన్స్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. నిజంగానే ఆమె నవ్వదా? అంటే.. అదేం లేదు. సుబ్బరంగా నవ్వుతుందని మీడియా వర్గాలు చెబుతాయి.

తన షోలో అప్పుడప్పుడు నవ్విన సందర్భాలు లేకపోలేదు. గ్రామీ అవార్డుల వేడుకల్లో తన మిత్రులతో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాఖాతాలో షేర్ చేశారు.అయితే..ఆమెకు ఒక అలవాటు ఉంటుందని చెబుతారు. రిపోర్టింగ్ సమయంలో.. అందునా వైట్ హౌస్ లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లలో సీరియస్ ప్రశ్నల్ని అడిగే వేళలో మాత్రం ఆమె గంభీరంగా ఉంటారు. నిజానికి ఈ లక్షణం బాధ్యత కలిగిన జర్నలిస్టుల లక్షణంగా చెప్పాలి. ఆమె వ్యక్తిగత తీరును ప్రస్తావించటం ద్వారా.. ట్రంప్ తాను అనుకున్నట్లు విషయాన్ని పక్కదారి పట్టించే విషయంలో విజయాన్ని సాధించారని చెప్పాలి.

ఇక..కైట్లాన్ కొల్లిన్స్ విషయానికి వస్తే ఆమెను నికార్సైన రిపోర్టర్ గా వ్యవహరిస్తారు. అంశాల మీద తన అభిఫ్రాయాల్ని చెప్పే కన్నా.. కచ్ఛితమైన సమాచారాన్ని.. డేటా ఆధారంగా రిపోర్టు చేస్తారన్న పేరుంది. ఆమె ప్రశ్నలు సూటిగా.. ఎలాంటి భయం లేకుండా ఉంటాయి. సీఎన్ఎన్ లో ఆమె నిర్వహించే ద సోర్స్ షో 2023 జులై మధ్యలో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు యూఎస్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల వేళలో టెలికాస్ట్ అవుతుంది.

అప్పటి నుంచి ఈ షో నేటికి అప్రతిహతంగా సాగుతూనే ఉంది. వార్తల వెనుక ఉన్న అసలు విషయాల్ని.. అతి పెద్ద రాజకీయ.. సామాజిక పరిణామాలపై లోతైన విశ్లేషణ చేస్తారన్న పేరుంది. 33 ఏళ్ల వయసున్న ఆమె.. తన వ్యక్తిగత వివరాల్ని రహస్యంగా ఉంచుతారన్న పేరుంది. 2019లో ఫోర్బ్స్ ప్రకటించిన మీడియా రంగంలో ప్రబావవంతమైన యువకుల జాబితాలో ఆమె నిలిచారు. 2024లో ప్రపంచాన్ని ప్రభావితం చేసే తర్వాతి తరం నాయకుల జాబితాలో ఆమె చోటు దక్కించుకోవటం చూస్తే.. ఆమె స్థాయి ఇట్టే అర్థమవుతుంది.