Begin typing your search above and press return to search.

వయసైపోయిందా.. క్యాబినెట్ సమావేశాల్లో ఆశ్చర్యపరిచిన ట్రంప్!

ఇకపోతే ఇక్కడ ఈ వీడియో షేర్ చేసింది ఎవరో కాదు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్.

By:  Madhu Reddy   |   3 Dec 2025 12:25 PM IST
వయసైపోయిందా.. క్యాబినెట్ సమావేశాల్లో ఆశ్చర్యపరిచిన ట్రంప్!
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 79 సంవత్సరాల వయసులో క్యాబినెట్ సమావేశాలలో చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆయన తీరును గమనించిన ప్రతి ఒక్కరు వయసైపోయిందా అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది సీరియస్గా సమావేశాలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ఎలా నిద్రపోగలిగాడు? అంటూ ఎవరికి వారు కామెంట్లు చేస్తున్నారు.. పైగా అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

డిసెంబర్ 2న వైట్ హౌస్ లో వెస్ట్ వింగ్ లోని క్యాబినెట్ రూంలో క్యాబినెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. రష్యా - ఉక్రెయిన్ వివాదంతో పాటు కీలక అంశాలపై సీనియర్ అధికారులు డోనాల్డ్ ట్రంప్ కు వివరిస్తుండగా.. 79 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్ ఆ సమయంలో తల ఊపుతూ.. కళ్ళు మూసుకొని కనిపించినట్లు అందుకు సంబంధించిన వీడియోలను కొంతమంది ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇకపోతే ఇక్కడ ఈ వీడియో షేర్ చేసింది ఎవరో కాదు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్. ఈయన షేర్ చేసిన వీడియోలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కళ్ళను చిన్నగా చేసుకుని కొన్నిసార్లు.. ఇంకొన్నిసార్లు పూర్తిగా మూసుకొని కూర్చుని ఉన్నట్లు మనం చూడవచ్చు. విదేశాంగ కార్యదర్శి.." రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయగల ఏకైక నాయకుడు ట్రంప్" అని ఆయన పక్కన మాట్లాడుతున్నట్లు కూడా మనం ఆ వీడియోలో చూడవచ్చు.

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షుడు చాలా సమయం పాటు కళ్ళు మూసుకొని కూర్చున్నట్లు కనిపించారని, ఆ తర్వాత మళ్లీ ముందుకు వంగి తల ఊపారని అటు నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయన మునుపటి రోజు ఏం చేశారు అనే విషయాన్ని కూడా ప్రజలు ఆరా తీశారు. విషయంలోకి వెళ్తే.. మునుపటి రోజు సాయంత్రం 7:00 నుండి అర్ధరాత్రి వరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఎక్కువసార్లు పోస్ట్లు చేయడంతో పాటు మళ్ళీ ఉదయం 6 గంటలకు ఆయన యాక్టివ్ గా ఉండడంతోనే అలసిపోయారని...అందుకే కేబినెట్ సమావేశాలలో కాస్త కళ్ళు మూసుకున్నారని సమాచారం.

అయితే ఈ విషయం వైరల్ కాకముందే ట్రంప్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి అంటూ దీన్ని న్యూయార్క్ టైమ్స్ హైలెట్ చేయడంతో ఆ విషయాన్ని ఇప్పుడు ప్రజలు హైలెట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా క్యాబినెట్ సమావేశాలలో ఇలా తుళ్ళినట్టు ట్రంప్ ప్రవర్తించిన తీరుకి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు అధ్యక్షుడు నిద్రమత్తులో ఉన్నాడు అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో వైట్ హౌస్ ఈ వార్తలను ఖండించింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పీపుల్ కు ఇచ్చిన ప్రకటనలో.. అధ్యక్షుడు ట్రంప్ శ్రద్ధగా వింటూ మూడు గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అంటూ తెలిపారు.