Begin typing your search above and press return to search.

అది నోరేనా? షికాగో నగరం ప్రపంచంలోనే డేంజర్ సిటీనట

షికాగో గవర్నర్.. మేయర్ అసమర్థత కారణంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Garuda Media   |   3 Sept 2025 9:41 AM IST
అది నోరేనా? షికాగో నగరం ప్రపంచంలోనే డేంజర్ సిటీనట
X

ఎవరేం అనుకున్నా.. ఏమైపోతున్నా.. తాను.. తన రాజకీయ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ఎకకువ కాదన్నట్ులగా వ్యవహరించటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలవాటు. తన ఎజెండాను అమలు చేసేందుకు సొంత దేశానికి.. సొంత నగరానికి చేటు చేసేందుకు సైతం వెనుకాడని వైనం ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. షికాగో నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా షికాగోను ఆయన అభివర్ణించారు. మరే దేశాధ్యక్షుడు సైతం ఈ తరహాలో తన సొంత దేశంలోని ఒక మహానగరంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చూసి ఉండం. కానీ.. ట్రంప్ లెక్కలే వేరుగా ఉంటాయి కాబట్టి.. ఆయన ఆ వ్యాఖ్యల్ని అలవోకగా చేసేశారు. అంతేకాదు.. శాంతిభద్రతల్ని అదుపులోకి తెచ్చేందుకు వీలుగా కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపుతామని వ్యాఖ్యానిస్తున్నారు.

షికాగో గవర్నర్.. మేయర్ అసమర్థత కారణంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకిలా? అంటే దరిద్రపుగొట్టు రాజకీయంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా చెప్పాలి. షికాగో మహానగరం ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉంది. షికాగో (చికాగో) అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. మరో మాటగా చెప్పాలంటే.. యూఎస్ లోని మూడో అతి పెద్ద సిటీ. అలాంటి మహానగరానికి మేయర్ గా ఉన్న బ్రాడన్ జాన్సన్.. షికాగో నగరం ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న జేబీ ప్రిట్జ్కర్ ఇద్దరు ట్రంప్ కు అస్సలు పడని డెమొక్రాట్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాధారణంగా తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి విమర్శలు చేయటం మామూలే.

మన దేశంలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న వేళ.. అందుకు భిన్నంగా తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు. అంతే తప్పించి ఒక మహానగరాన్ని.. దాని ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేయరు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్.. తన దేశంలోని అతి పెద్దదైన మూడో మహానగరాన్ని ఉద్దేశించి ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

షికాగోను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. తన రాజకీయ ప్రయోజనాల కోసం దేనినైనా బలి ఇచ్చేందుకు వెనుకాడరా? అన్న భావన కలుగుతుంది. అమెరికా అధ్యక్షుడే తన దేశంలోని ఒక ప్రధాన నగరం గురించి.. అక్కడి శాంతిభద్రతల గురించి తప్పుడు సమచారాం వ్యాపించేలా వ్యాఖ్యలు చేయటంలో అర్థం లేదనే చెప్పాలి. విదేశీ పర్యాటకులు.. పెట్టుబడిదారులను భయాందోళనకు గురి చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి కారణాలతో అంతర్జాతీయ సమావేశాల్ని నిర్వహించే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు.. వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్ మీదా ప్రభావాన్ని చూపించొచ్చు.

అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఈ తరహాలో వ్యాఖ్యలు చేసిన వైనాన్ని విదేశీ మీడియా సైతం ప్రముఖంగా కవర్ చేస్తుంది. అయితే.. ట్రంప్ తీరు పైనా.. ఆయన మాటల మీదా ఎవరికి ఎంత నమ్మకం ఉందో తెలిసింది కాబట్టి ఫర్లేదు. అయినప్పటికీ తనకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారి విషయంలో ట్రంప్ ఎంత కరకుగా ఉంటారన్నది తాజాగా ఆయన చేసిన ప్రకటనను చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.

నిజంగానే ట్రంప్ చెప్పినట్లు షికాగో మహానగరం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదా? అన్నది క్రాస్ చెక్ చేస్తే.. ఆయన ఎంతటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో తెలిసిపోతుంది. షికాగోలో గన్ కల్చర్.. క్రైం రేట్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ లాటిన్ అమెరికాలోని కొన్ని నగరాలైన కారాకస్.. టిజువానా.. సాన్ పెడ్రోసులా లాంటి నగరాలు హత్యల్లో ముందుంటాయి. అలాంటి వేళ.. షికాగో అత్యంత సురక్షిత నగరంగా చెప్పొచ్చు.

ముఖ్యంగా విదేశీయులు పర్యటించే డౌన్ టౌన్.. నార్త్ సైడ్ ప్రాంతాలు సేఫ్ ప్రాంతాలుగా చెప్పొచ్చు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. అందుకు భిన్నంగా షికాగో అత్యంత డేంజర్ సిటీ అని వ్యాఖ్యానించటం ఆ నగర ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమేనని చెప్పక తప్పదు. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. అధికారిక గణాంకాలు ఏవీ కూడా షికాగోను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర నగర జాబితాలో చూపించటం లేదు. మెక్సికోలోని కొలిమా నగరం అత్యంత నేరమయ ప్రాంతంగా చెప్పొచ్చు. అదే విధంగా పోర్టో-ప్రిన్స్ కూడా. ఇక్కడ హత్యల రేటు ఎక్కువ.

ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రమాదకర నగరాలున్నాయి. ఇతర దేశాల్లోని నగరాల్ని పక్కన పెట్టి అమెరికాలో జనాభా పరంగా ఎక్కువగా ఉండే సెయింట్ లూయిస్.. మెంఫిస్.. బాల్టిమోర్..న్యూ ఓర్లీన్స్.. డెట్రాయిట్ లాంటి ప్రాంతాలతో పోల్చినా షికాగోలో హత్యలు తక్కువగా నమోదవుతాయి. కేవలం తన ప్రత్యర్థి పార్టీ చేతిలో ఆ రాష్ట్ర పగ్గాలు.. షికాగో నగర మేయర్ ఉండటంతోనే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో ఇట్టే అర్థమవుతుంది.