వైట్ హౌస్ లో జోబైడెన్ కు ఘోర అవమానం.. ట్రంప్ స్ట్రోక్ మామూలుగా లేదు
బైడెన్‌కు మానసిక సామర్థ్యం తగ్గిపోవడం వల్ల, ఆయన సిబ్బంది ఆయన ప్రమేయం లేకుండానే ఆటోపెన్ ద్వారా సంతకాలు చేయించారని ట్రంప్ వాదిస్తున్నారు.
By: A.N.Kumar | 28 Sept 2025 10:42 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వైట్ హౌస్‌లో ప్రారంభించిన "ప్రెసిడెంట్‌ల వాక్ ఆఫ్ ఫేమ్" వివాదానికి తెరలేపింది. ఈ ప్రదర్శనలో మాజీ అధ్యక్షులందరి ఫోటోలు వరుసగా ఉంచగా.. 46వ అధ్యక్షుడు జో బైడెన్ ఫోటో స్థానంలో 'ఆటోపెన్' యంత్రం చిత్రాన్ని ఉంచడం అమెరికన్ రాజకీయాలలో పెను చర్చకు దారితీసింది. దీన్ని ట్రంప్ అనుచరులు 'జీనియస్ స్ట్రోక్' అని కీర్తిస్తుండగా.. డెమొక్రాట్‌లు మాత్రం "ఘోర అవమానం"గా ఖండిస్తున్నారు.
*ఆటోపెన్ వివాదం ఏంటి?
ఆటోపెన్ అనేది డాక్యుమెంట్లపై సంతకాలను యాంత్రికంగా పునరుత్పత్తి చేసే యంత్రం. ఉన్నతాధికారులు, అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పత్రాలపై సంతకాలు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే బైడెన్ తన పదవీకాలం ముగిసే సమయంలో ఇచ్చిన కొన్ని క్షమాభిక్షలు , ముఖ్యమైన నిర్ణయాలపై ఆటోపెన్‌ను అనధికారికంగా ఉపయోగించారని ట్రంప్ ఆరోపించారు.
* ట్రంప్ ఆరోపణ
బైడెన్‌కు మానసిక సామర్థ్యం తగ్గిపోవడం వల్ల, ఆయన సిబ్బంది ఆయన ప్రమేయం లేకుండానే ఆటోపెన్ ద్వారా సంతకాలు చేయించారని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ కారణంగా బైడెన్ ఇచ్చిన వేలాది క్షమాభిక్షలు చెల్లవని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
బైడెన్ వివరణ
బైడెన్ తన పదవీకాలంలో తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని, క్షమాభిక్షను తానై స్వయంగా ఆమోదించినట్లు ధృవీకరించారు. అయితే ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లపై సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆటోపెన్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఒబామా, బుష్, ట్రంప్ వంటి మాజీ అధ్యక్షులు కూడా దీనిని ఉపయోగించారు. రిపబ్లికన్ నేతృత్వంలోని హౌస్ కమిటీ సైతం బైడెన్ ఆటోపెన్ వినియోగంపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది.
వైట్ హౌస్‌లో కొత్త ప్రదర్శన
ట్రంప్ వెస్ట్ వింగ్ కొలొనేడ్‌లో ఏర్పాటు చేసిన ఈ "వాక్ ఆఫ్ ఫేమ్"లో బైడెన్ యొక్క అధికారిక ఫోటో స్థానంలో ఆటోపెన్ యంత్రం బైడెన్ సంతకాన్ని పెడుతున్న చిత్రాన్ని ఫ్రేమ్ చేసి ఉంచారు. మాజీ అధ్యక్షుడిపై వ్యక్తిగత దాడికి దిగడం, ఆయన వారసత్వాన్ని పూర్తిగా అవమానపర్చడం ట్రంప్ ఉద్దేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య ట్రంప్ తన మద్దతుదారులను మరోసారి ఉత్సాహపరచడానికి, బైడెన్‌పై వ్యక్తిగత విమర్శలను రాజకీయ అస్త్రంగా మార్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఈ సంఘటన వైట్ హౌస్ ఆవరణలో కూడా రాజకీయ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. ట్రంప్ ఇంతకుముందు కూడా ఓవల్ ఆఫీస్‌లో అలంకరణ మార్పులు, మాజీ అధ్యక్షుల చిత్రాలను తొలగించడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచారు.
ఈ వీడియోలో జో బైడెన్ ఫోటో స్థానంలో ఆటోపెన్ చిత్రాన్ని ఉంచిన "ప్రెసిడెంట్‌ల వాక్ ఆఫ్ ఫేమ్" ప్రదర్శనను చూడవచ్చు
