ఉక్రెయిన్ పీక నొక్కేసిన ట్రంప్.. ఇక ఆయువుపట్టు రష్యా చేతికే!
డాన్ బాస్..! ఉక్రెయిన్ లోని అత్యంత కీలక ప్రాంతం. సహజ వనరులు అధికంగా ఉండే పారిశ్రామికంగా అత్యంత డెవలప్ అయిన ప్రాంతం.
By: Tupaki Political Desk | 20 Nov 2025 12:27 PM ISTడాన్ బాస్..! ఉక్రెయిన్ లోని అత్యంత కీలక ప్రాంతం. సహజ వనరులు అధికంగా ఉండే పారిశ్రామికంగా అత్యంత డెవలప్ అయిన ప్రాంతం. రష్యాకు సమీపంలో ఉండే డాన్ బాస్ లో మాట్లాడేది కూడా రష్యన్ భాషనే. భౌగోళికంగా రష్యా 2014లో ఆక్రమించిన ఉక్రెయిన్ కు చెందిన అత్యంత కీలక క్రిమియాకు నేరుగా వెళ్లేందుకు అవకాశం కల్పించే ప్రాంతం. ఇంతటి కీలక డాన్ బాస్ లో రెండు ప్రాంతాలు. ఒకటి డొనెట్స్క్, రెండు లుగాన్స్క్. ఈ రెండింటిని కలిపి డాన్ బాస్ గా వ్యవహరిస్తుంటారు. 70 శాతం డొనెట్క్స్, 94 శాతం లుగాన్స్క్‌ను ఇప్పటికే ఆక్రమించేసింది. గతంలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది దాదాపు తమలో కలిపేసుకుంది. ఇప్పుడు అలాంటి కీలక ప్రాంతంపై రష్యాకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసేసుకుని ఉక్రెయిన్ పీక నొక్కేశారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఊహించని షాక్ ఇచ్చారు.
అశాంతి.. అశాంతి.. ఒప్పందం..
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగి మరో మూడు నెలల్లో నాలుగేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా ఉన్న శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించారు. ఈ శాంతి ఒప్పందం 28 అంశాలతో ఉంది. అయితే, ఇందులో ఎక్కువ అంశాలు రష్యాకు అనుకూలమైనవే. దీనిని తయారు చేసింది కూడా రష్యా, అమెరికా అధికారులే. ఇప్పటికే జెలెన్ స్కీకి దీనిని అందించారు. ఇలాంటిదానిని ట్రంప్ ఏకపక్షంగా ఆమోదించేశారు. శాంతి ఒప్పందంలోని పలు అంశాలను జెలెన్ స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. మరీ ముఖ్యంగా డాన్ బాస్ ప్రాంతాన్ని రష్యాకు కట్టబెట్టేలా ఉన్న అంశాలను తప్పుబడుతున్నారు.
డాన్ బాస్ పోయినట్లే..
ఉక్రెయిన్ కు తూర్పు భాగంలో ఉంటుంది డాన్ బాస్. సంపన్న ప్రాంతం. రష్యన్ భాష మాట్లాడే ప్రజలు అధికం. ఇప్పుడు రష్యా ఆధిపత్యంలోనే ఉంది. దీంతోపాటు మరికొంత ప్రాంతాన్ని కూడా రష్యాకు అప్పగించేలా శాంతి ఒప్పందం ఉంది. అంతేగాక ఉక్రెయిన్ తమ సైనిక బలగాలను సగం తగ్గించుకోవాలని ఉంది. ఉక్రెయిన్ కు అమెరికా సైనిక సాయం కూడా చేయకూడదు. ఆ దేశంలో విదేశీ (నాటో) దళాలు ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్ కు ఎవరూ అందించకూడదు అనేది శాంతి ఒప్పందంలోని కీలక అంశాలు.
జెలెన్ స్కీ వీక్ నెస్ తో..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సహచరులు, సలహాదారుల చుట్టూ ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వారిపై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే అవకాశం తీసుకుని ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ఆమోదించారనే అభిప్రాయం కలుగుతోంది.
