Begin typing your search above and press return to search.

అగ్రరాజ్య చరిత్రలో తొలిసారి : అమెరికా రాజకీయాల్లో ’ట్రంప్‘ చారిత్రక పతనం

అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ అట్టడుగు స్థాయికి పడిపోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   1 April 2026 10:39 AM IST
అగ్రరాజ్య చరిత్రలో తొలిసారి : అమెరికా రాజకీయాల్లో ’ట్రంప్‘ చారిత్రక పతనం
X

అమెరికా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ అట్టడుగు స్థాయికి పడిపోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరి, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అమెరికా ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.

అట్టడుగుకు అప్రూవల్ రేటింగ్.. చారిత్రక పతనం

తాజా గణాంకాల ప్రకారం.. డోనాల్డ్ ట్రంప్ నెట్ అప్రూవల్ రేటింగ్ -17 శాతానికి పడిపోయింది. ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలోనే కాదు.. ఆధునిక అమెరికా చరిత్రలో అధికారంలో ఉన్న ఏ అధ్యక్షుడికీ నమోదు కానంతటి కనిష్ట స్థాయి. సాధారణంగా అధ్యక్షులు తమ పదవీకాలం మధ్యలో కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజమే అయినప్పటికీ.. ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఇరాన్ వివాదం: ప్రజాస్వామ్యమా? రాజరికమా?

ట్రంప్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్‌పై యుద్ధం విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు. రాజ్యాంగబద్ధంగా యుద్ధ ప్రకటన లేదా కీలక సైనిక చర్యల విషయంలో కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అయితే ట్రంప్ ప్రజాస్వామ్య వ్యవస్థలను పక్కనపెట్టి ఒక మోనార్క్‌ వలె వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిత్రదేశాలను సంప్రదించకుండా ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అమెరికా దౌత్య నీతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. విదేశాంగ విధానంలో స్థిరత్వం లేకపోవడం వల్ల అమెరికా అంతర్జాతీయంగా ఒంటరయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

పార్టీ అంతర్గత మద్దతులో చీలిక

ట్రంప్ బలం ఎప్పుడూ ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీయే. కానీ ఇప్పుడు ఆ కోటలో కూడా పగుళ్లు కనిపిస్తున్నాయి. గతంలో 92 శాతంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ మద్దతు ఇప్పుడు 84 శాతానికి పడిపోయింది. ఇది స్వల్పంగా అనిపించినా పార్టీ అంతర్గతంగా ఉన్న అసమ్మతికి ఇది నిదర్శనం. మరోవైపు ప్రత్యర్థి పార్టీ అయిన డెమోక్రాట్లలో దాదాపు 95 శాతం మంది ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. స్వతంత్ర ఓటర్లు కూడా ట్రంప్ నాయకత్వ శైలి పట్ల విముఖత చూపుతుండటం ఆయనకు పెద్ద దెబ్బగా పరిణమించింది.

ప్రజా వ్యతిరేకతకు ఇతర కారణాలు

కేవలం విదేశాంగ విధానమే కాకుండా దేశీయ అంశాలు కూడా ట్రంప్ రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, సామాన్యుడి ఆర్థిక స్థితిగతులపై దృష్టి పెట్టకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మీడియాపై నిరంతర విమర్శలు.. విమర్శించే వారిని శత్రువులుగా చూడటం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆయన గౌరవాన్ని తగ్గించాయి. వాస్తవ పరిస్థితులను కాదని.. కేవలం తన అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాలనలో పారదర్శకత లోపించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. "అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన సహనం.. రాజ్యాంగంపై గౌరవం ట్రంప్ వైఖరిలో లోపించాయి. ఇది దేశ భవిష్యత్తుకే ముప్పు." అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ భవిష్యత్తు ఏంటి?

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ట్రంప్ తన రాజకీయ వ్యూహాలను తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. యుద్ధం వైపు అడుగులు వేయడం కంటే, దేశీయ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోతే ఈ రేటింగ్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. రాబోయే ఎన్నికల నాటికి ఆయన తన కోల్పోయిన ప్రజాదరణను తిరిగి సంపాదించుకుంటారా? లేదా ఈ పతనం ఆయన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతుందా? అనేది వేచి చూడాలి. అమెరికా రాజకీయ యవనికపై ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీయడం ఖాయం.