యుద్ధం ముగిస్తానంటున్న ట్రంప్.. అమెరికన్ కంపెనీలను టార్గెట్ చేసిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా చేసిన సంచలన ప్రకటన ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
By: A.N.Kumar | 1 April 2026 1:21 PM ISTపశ్చిమాసియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్థిరత ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపు వద్ద నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా చేసిన సంచలన ప్రకటన ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఇరాన్‌పై సాగుతున్న సైనిక చర్యను మరో రెండు నుంచి మూడు వారాల్లో ముగిస్తామని ఆయన ప్రకటించడం.. యుద్ధ మేఘాల మధ్య ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తున్నప్పటికీ తెరవెనుక పొంచి ఉన్న ముప్పులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
యుద్ధం ముగింపు దశకు.. ట్రంప్ వ్యూహాత్మక ప్రకటన
వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ అత్యంత స్పష్టతతో తన నిర్ణయాన్ని ప్రకటించారు. "మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. ఇది కేవలం ఒక ఒప్పందంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం కాదు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యం, సైనిక శక్తి కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ అడుగు వేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన వైమానిక దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చాయని.. ఆ దేశం తిరిగి పూర్వస్థితికి రావడానికి కనీసం 15 నుంచి 20 ఏళ్లు పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఈ పరిణామాలను ధృవీకరించారు. యుద్ధం దాని తుది అంకానికి చేరుకుందని అతి త్వరలోనే జాతిని ఉద్దేశించి ట్రంప్ చేయనున్న ప్రసంగంలో మరిన్ని కీలకమైన భౌగోళిక-రాజకీయ నిర్ణయాలు వెలువడతాయని ఆయన సంకేతాలిచ్చారు.
కార్పొరేట్ దిగ్గజాలకు ఇరాన్ హెచ్చరిక: ‘సైబర్’ ముప్పు పొంచి ఉందా?
ట్రంప్ ప్రకటనతో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్న తరుణంలో ఇరాన్ నుంచి వెలువడిన హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇరాన్ కేవలం సైనిక దాడులకు పరిమితం కాకుండా అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెక్, ఫైనాన్స్ దిగ్గజాలపై దాడులు చేస్తామని ఇరాన్ బహిరంగంగా హెచ్చరించింది.
ఈ జాబితాలో ఉన్న సంస్థలు చూస్తే ఇరాన్ ఎంతటి తీవ్రమైన ప్రతీకారానికి సిద్ధమవుతుందో అర్థమవుతుంది. టెక్ దిగ్గజాలైన ఆపిల్, మైక్రోసాఫ్ట్ , గూగుల్, మెటా, ఎన్వీడియా తోపాటు హార్డ్‌వేర్ & సాఫ్ట్‌వేర్ సంస్థలు సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, ఐబీఎం, డెల్. అలాగే.. ఆర్థిక , పారిశ్రామిక దిగ్గజాలైన జేపీ మోర్గాన్ చేజ్, టెస్లా, జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలను ఇరాన్ టార్గెట్ చేసింది.. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల (టెహ్రాన్ సమయం) లోపు ఈ హెచ్చరికలు అమలులోకి వస్తాయని డెడ్‌లైన్ విధించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ, ఫైనాన్స్ రంగాలను వణికించేలా చేస్తోంది. ఇది సాంప్రదాయ యుద్ధం నుంచి అత్యాధునిక సైబర్ లేదా వ్యూహాత్మక ఆర్థిక యుద్ధంగా మారే ప్రమాదాన్ని సూచిస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఈ పరిణామాలు మార్కెట్లపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవైపు అమెరికా గ్యాస్ ధరలు తగ్గుతాయని ట్రంప్ భరోసా ఇస్తుండగా మరోవైపు ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న కార్పొరేట్ సంస్థల షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇరాన్ గనుక ఈ దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు లేదా ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌లపై దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసు.. డిజిటల్ వ్యవస్థను కుప్పకూల్చే అవకాశం ఉంది.
యుద్ధం రణక్షేత్రం నుంచి వైదొలగడం ఒక ఎత్తైతే, అది డిజిటల్ , ఆర్థిక రంగానికి వ్యాపించడం మరో ఎత్తు. ఇరాన్ హెచ్చరించినట్లుగా కార్పొరేట్ యుద్ధం మొదలైతే దాని తీవ్రత సరిహద్దులకు అతీతంగా ఉంటుంది.
మొత్తానికి పశ్చిమాసియాలో తుపాకీ గొట్టాలు నిశ్శబ్దమవుతున్న వేళ సరికొత్త తరహా ఘర్షణలకు అంకురార్పణ జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రెండు వారాలు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకం కానున్నాయి.
