Begin typing your search above and press return to search.

680 కి.మీ. తర్వాత యూటర్న్... ట్రంప్ విమానానికి ఏమైంది..!

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని, ప్రసంగించనున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   21 Jan 2026 10:37 AM IST
680 కి.మీ. తర్వాత యూటర్న్...  ట్రంప్  విమానానికి ఏమైంది..!
X

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని, ప్రసంగించనున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11:07 గంటలకు బయలుదేరిన ఆయన ప్రయాణిస్తున్న విమానం "ఎయిర్ ఫోర్స్ వన్" యూటర్న్ తీసుకుని తిరిగి మేరీల్యాండ్ లోని బేస్ ఆండ్రూస్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... మంగళవారం రాత్రి స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ కు అధ్యక్షుడు ట్రంప్‌ తో బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం టేకాఫ్ అయిన గంటలోపు తిరిగి మేరీల్యాండ్‌ కు చేరుకుంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.. జాయింట్ బేస్ ఆండ్రూస్ నుండి టేకాఫ్ అయిన తర్వాత సిబ్బంది 'చిన్న విద్యుత్ సమస్య'ను గుర్తించారని.. దీంతో చాలా జాగ్రత్తగా తిరిగి బేస్‌ కు రావాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రెస్ క్యాబిన్‌ లోని లైట్లు కొద్దిసేపు ఆరిపోయాయని లీవిట్ విలేకరులు చెప్పారు. ఈ నేపథ్యంలో విమానాన్ని జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దీంతో.. ట్రంప్ మరో విమానంలో దావోస్ వెళ్తారని ఆమె వివరించారు. వాస్తవానికి.. ప్రపంచ ఆర్థిక వేదిక కోసం దావోస్‌ కు వెళ్తున్న ట్రంప్.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:30 గంటలకు ప్రసంగించాల్సి ఉంది. అయితే ఇది ఆలస్యం కావొచ్చని అంటున్నారు.

కాగా... అమెరికాలోని వాషింగ్టన్ నుంచి స్విట్జర్లాండ్ కు విమానంలో దాదాపు 6,785 కిలో మీటర్ల ప్రయాణం ఉంటుంది! ఈ క్రమంలో ట్రంప్ బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం... టెకాఫ్ అనంతరం సుమారు 680 కి.మీ. ప్రయాణించిన తర్వాత యూటర్న్ తీసుకుని తిరిగి టెకాఫ్ అయిన స్థానానికి చేరుకుంది.

దావోస్ లో ట్రంప్ తో భేటీకి మెక్రాన్ సిద్ధం!:

గ్రీన్‌ లాండ్‌ కు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్న ఫ్రాన్స్‌ పై ట్రంప్‌ సుంకాలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 200 శాతం సుంకాలను విధిస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. దావోస్‌ కు వచ్చిన ట్రంప్‌ తో తాను భేటీకి సిద్ధమని.. ఈ సమయంలో జీ7 దేశాల నేతలను ఆహ్వానిస్తానని.. వారితోపాటు ఉక్రెయిన్, డెన్మార్క్, సిరియా, రష్యా వారినీ పిలుస్తానని మెక్రాన్‌ తాజాగా తెలిపారు. అంతేకాదు.. గురువారం ట్రంప్‌ ను విందుకు తీసుకెళ్తానని చెప్పారు. దీంతో దావోస్ వేదికగా ట్రంప్ - మెక్రాన్ భేటీపై ఆసక్తి నెలకొంది!