Begin typing your search above and press return to search.

హెచ్1 బీ వీసాదారుల కొంప ముంచిన ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు.. ముఖ్యంగా భారతీయ టెక్కీలకు మళ్లీ ఆందోళనకరమైన రోజులు మొదలయ్యాయి.

By:  A.N.Kumar   |   8 Aug 2026 11:41 PM IST
హెచ్1 బీ వీసాదారుల కొంప ముంచిన ట్రంప్
X

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు.. ముఖ్యంగా భారతీయ టెక్కీలకు మళ్లీ ఆందోళనకరమైన రోజులు మొదలయ్యాయి. హెచ్‌1బీ వీసాదారులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు ఇప్పటివరకు లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సిద్ధం చేసిన నూతన ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించి నిబంధన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టివేయబడుతుంది.

సాధారణంగా 2017లో ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, హెచ్‌1బీ వంటి నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై ఉన్న ఉద్యోగి అనుకోకుండా లేఆఫ్స్ లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. వారికి చట్టబద్ధంగా 60 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ లభించేది. ఈ వ్యవధిలో వారు మరొక కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం.. తమ హెచ్‌1బీ వీసాను కొత్త యజమానికి బదిలీ చేసుకోవడం లేదా ఇతర చట్టబద్ధమైన వీసా స్టేటస్‌లోకి మారడం వంటి పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ వెసులుబాటును రద్దు చేస్తే ఉద్యోగం పోయిన మరుసటి క్షణమే వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ చెల్లుబాటు కాకుండా పోతుంది. దీనివల్ల అమెరికాలో ఉంటూ కొత్త ఉద్యోగాన్ని అన్వేషించే అవకాశాలు దాదాపు మూసుకుపోతాయి.

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ నిపుణుల కంటే అత్యంత తీవ్రంగా నష్టపోయేది భారతీయ టెక్కీలేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమెరికా జారీ చేసే మొత్తం హెచ్‌1బీ వీసాల్లో సుమారు 71 శాతానికి పైగా వాటాను భారతీయులే దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో నిరంతరం లేఆఫ్‌ల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ కూడా లేకపోతే ఉద్యోగం కోల్పోయిన భారతీయ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కొత్త ఉద్యోగం పొందే సమయం కూడా ఉండకపోవడంతో వారు కుటుంబాలతో సహా రాత్రికి రాత్రే అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ ప్రతిపాదన ప్రభావం కేవలం ప్రధాన ఉద్యోగికే పరిమితం కాకుండా వారి కుటుంబ సభ్యులపైనా తీవ్రంగా పడుతుంది. హెచ్‌1బీ వీసాదారుడిపై ఆధారపడి అమెరికాలో ఉంటున్న హెచ్-4 వీసా కలిగిన జీవిత భాగస్వాములు, పిల్లల స్టేటస్ కూడా ప్రధాన ఉద్యోగి స్టేటస్‌పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రధాన వీసా రద్దయిన వెంటనే కుటుంబం మొత్తానికి అక్కడ ఉండే అర్హత కోల్పోతుంది. దీనివల్ల వారి పిల్లల చదువులు, ఇళ్ల రుణాలు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ ఒక్కసారిగా గందరగోళంలో పడతాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా తుది పరిశీలన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే వార్తలతో అమెరికాలోని భారతీయ టెక్ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.