భారత్‌పై ట్రంప్ కు ఎందుకంత కడుపుమంట?
భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడమే కాకుండా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను తప్పుపట్టారు.
By: A.N.Kumar | 26 Aug 2025 1:39 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు. భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడమే కాకుండా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు పీటర్ నవర్రో, స్కాట్ బెస్టెంట్ వంటి నేతలు కూడా, భారత్ రష్యాకు రెవెన్యూ అందించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు.
- జైశంకర్ స్పష్టీకరణ
అయితే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. భారత్ తన అవసరాలకు మించి ఎప్పుడూ ఆయిల్ దిగుమతి చేయలేదని, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నందునే రిఫైనరీల ద్వారా ప్రాసెస్ చేసి యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయమని మొదటగా సూచించింది అమెరికానేనని ఆయన గుర్తు చేశారు. అమెరికా, యూరప్‌లు రష్యాపై ఆంక్షలు విధించుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని, చివరికి భారతీయ రిఫైనరీల ఉత్పత్తులను తామే కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
- గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రస్తుతం భారత్ ఆయిల్ అవసరాల్లో సుమారు 20-23% ఇరాక్ నుంచి, 16-18% సౌదీ అరేబియా నుంచి, 18-20% రష్యా నుంచి వస్తున్నాయి. అదనంగా 8-10% యూఏఈ, 6-7% అమెరికా, 5-6% నైజీరియా, ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. అంటే భారత్ ఒకే దేశంపై ఆధారపడటం లేదు. దీనికి విరుద్ధంగా చైనా మాత్రం 2024లోనే 108 మిలియన్ టన్నుల రష్యా ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం చైనాపై ఇలాంటి సుంకాలు విధించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
- వ్యాపార ప్రయోజనాల ద్వంద్వ నీతి
అమెరికా తన వ్యాపార లాభాల కోసం యూరప్ దేశాలను లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలు చేయమని బలవంతపెట్టడం, బిలియన్ల డాలర్ల డిఫెన్స్ ఒప్పందాలను కుదుర్చుకోవడం సహజమని భావిస్తే, భారత కంపెనీలు రష్యా నుంచి డిస్కౌంట్ ధరలో ఆయిల్ కొనుగోలు చేసి లాభం పొందడాన్ని విమర్శించడం స్పష్టమైన ద్వంద్వ నీతి. “బిజినెస్ అనేది అమెరికా తత్త్వం అని చెప్పుకునే వాళ్లే, ఇతర దేశాల వ్యాపార నిర్ణయాలను విమర్శించడం హాస్యాస్పదం” అని జైశంకర్ చేసిన సెటైర్ అప్పట్లోనే ప్రపంచ మీడియా హైలెట్ చేసింది.
మొత్తానికి ట్రంప్ ఆరోపణలు వాస్తవానికి నిలబడవు. భారత్ తన అవసరాలకు తగ్గట్టే ఆయిల్ దిగుమతి చేసుకుంటూ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రాసెస్‌డ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్‌పై ఒత్తిడి చేయడం అమెరికా ద్వంద్వ వైఖరి తప్ప మరొకటి కాదని గణాంకాలే చెబుతున్నాయి.
