విలేకరి వేసిన మూడు ప్రశ్నలు ట్రంప్ కు ఎంత కోపం తెప్పించాయంటే?
ఈ సందర్భంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ను ఉద్దేశించి.. ‘జర్నలిస్టు ఖషోగ్గీని మీరే హత్య చేయించారని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
By: Garuda Media | 20 Nov 2025 11:30 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆయన ఎలా రియాక్టు అవుతారో అంచనా వేయలేని పరిస్థితి. ఏ ప్రశ్నకు ఆయన ఏ రీతిలో స్పందిస్తారో తెలీదు. అంతేకాదు.. ఆయన్ను ఇరుకున పెట్టేలా ప్రశ్నించే వారిపై ఆయన ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. తాజాగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తో కలిసి వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. ఒక మహిళా విలేకరి అడిగిన మూడు ప్రశ్నలకు ఆయన అసాధారణంగా స్పందించారు.
ఒక దశలో ఆమె పని చేస్తున్న మీడియా సంస్థ (ఏబీసీ న్యూస్) లైసెన్సును రద్దు చేస్తానని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. సదరు మహిళా జర్నలిస్టును ఒక ఉగ్ర జర్నలిస్టుగా పేర్కొంటూ ధ్వజమెత్తారు. ఇంతకూ ఆ మహిళా జర్నలిస్టు ఎవరు? ఆమె అడిగిన మూడు ప్రశ్నలు ఏవన్న అంశాల్లోకి వెళితే.. ఏబీసీ న్యూస్ కు చెందిన మేరీ బ్రూస్ సీనియర్ జర్నలిస్టు.
వైట్ హౌస్ వార్తల్ని కవర్ చేసే ఆమె.. ట్రంప్ తాజా మీడియా భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ను ఉద్దేశించి.. ‘జర్నలిస్టు ఖషోగ్గీని మీరే హత్య చేయించారని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.ఈ సమయంలో మీరు అధ్యక్షుడి కార్యాలయంలో ఉండటంపై సెప్టెంబరు 11 బాధితులు ఆగ్రహంగా ఉన్నారు. మిమ్మల్ని అమెరికన్లు ఎందుకు నమ్మాలి?’’ అని సూటిగా ప్రశ్నించారు. దీనికి ముందు ట్రంప్ ను ఉద్దేశించి మరో ఘాటు ప్రశ్నను సంధించారు.
‘‘అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. సౌదీ అరేబియాలో మీ కుటుంబం వ్యాపారం చేయటం సమంజసమేనా? అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. సౌదీ అరేబియాలో తమ ఫ్యామిలీ వ్యాపారాల్ని సమర్థించుకున్నారు. ఖషోగ్గీ హత్యలో అమెరికా నిఘా విభాగం ఇచ్చిన రిపోర్టును తోసిపుచ్చారు. ఇదే ప్రశ్నలకు యువరాజు స్పందిస్తూ.. ఖషోగ్గీ హత్య బాధాకరమని.. పెద్ద తప్పిదంగా పేర్కొన్నారు.
మహిళా విలేకరి ప్రశ్నించిన ప్రశ్నలకు ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఏబీసీ న్యూస్ లైసెన్సును వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తున్నానని.. ఎందుకంటే వారివన్నీ ఫేక్ న్యూస్ గా పేర్కొన్నారు. ‘‘మీరు 97 శాతం ట్రంప్ పై వ్యతిరేకతతో ఉంటారు. ఎన్నికల్లో నేను భారీ మెజార్టీతో గెలిచానంటే మీవన్నీ నమ్మదగిన వార్తలు కావని అర్థం’’ అంటూ ప్రదర్శించిన ఆగ్రహం ఎప్పటిలానే సంచలనంగా మారింది.
