Begin typing your search above and press return to search.

ట్రంప్ నకు ఊహించని షాకిచ్చిన ఇండోనేషియా

కాలం చక్రం లాంటిది. ఎవరి అధిక్యతను.. అధిపత్యాన్ని శాశ్వితంగా ఉండదు. మార్పు సహజ ప్రక్రియ.

By:  Garuda Media   |   24 March 2026 12:00 PM IST
ట్రంప్ నకు ఊహించని షాకిచ్చిన ఇండోనేషియా
X

కాలం చక్రం లాంటిది. ఎవరి అధిక్యతను.. అధిపత్యాన్ని శాశ్వితంగా ఉండదు. మార్పు సహజ ప్రక్రియ. ఆ విషయాల్ని అర్థం చేసుకోవటంలో జరిగే తప్పులకు సైతం మూల్యం చెల్లించాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి దేశాధ్యక్షుడు కావాలన్న కోరికను బలంగా కనటమే కాదు.. దాన్ని వాస్తవంలోకి తెచ్చుకోవటంలో ట్రంప్ పడిన తపన అంతా ఇంతా కాదు. రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తొలిరోజు నుంచే ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచనివ్వకుండా.. రోజుకో నిర్ణయంతో సంచలనాలకు మారుపేరుగా నిలవటమే కాదు.. ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రపంచం ఇప్పుడు తీవ్రమైన అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది.

ట్రంప్ మహాశయులవారు ఏ రోజు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో అర్థం కాక యావత్ ప్రపంచం కిందా మీదా పడింది. ఇరాన్ మీద ఏకక్షంగా యుద్ధానికి దిగిన ఆయన.. మూడు వారాల్లో వార్ ను ముగిస్తామని చెప్పినప్పటికీ.. వాస్తవంలోకి దిగిన తర్వాత ఆయనకు తత్త్వం బోధ పడిన పరిస్థితి. మొన్నటివరకు తమకు తిరుగేలేదన్న రీతిలో వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు యుద్ధాన్ని నాలుగు రోజులు విశ్రాంతి ఇవ్వటానికి తనకు తానే నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. అమెరికా నిర్ణయం సంగతేమో కానీ.. తాము మాత్రం దాడులు చేస్తూనే ఉంటానని అమెరికా మిత్రపక్షం ఇజ్రాయెల్ తెగేసి చెప్పిన పరిస్థితి.

వీరిద్దరి తీరు ఇలా ఉంటే.. ఇప్పటికే తీవ్రమైన దాడుల బారిన పడిన ఇరాన్.. నిండా మునిగిన తర్వాత చలేంటి? అన్న రీతిలో రియాక్టు అవుతూ.. అమెరికా మిత్రదేశాలపై.. వారి ఆర్థిక మూలాలపై వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడటం ద్వారా.. ఆయా దేశాలన్ని కిందా మీదా పడుతున్న పరిస్థితి. అలా అని అగ్రరాజ్యాన్ని నిందించలేవు. పోనీ తమపై దాడులు చేసే ఇరాన్ మీద ప్రతాపం చూపించే శక్తి సామర్థ్యాలు తక్కువే. దీంతో.. అడకత్తెరలో పోకచెక్కలా మారిన దేశాలు ట్రంప్ తీరులో మార్పునకు కొంతకారణమయ్యాయని చెబుతారు.

ఇలాంటి వేళలోనూ.. ట్రంప్ నకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్యన వాటి జోరు మరింత పెరిగింది. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ఇండోనేషియా. గడిచిన కొన్నేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచంలో పదిహేడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైన ఈ ఆగ్నేయాషియా దేశం ఇప్పుడు ట్రంప్ కు ఊహించని రీతిలో షాకిచ్చింది. ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన బోర్డు ఆఫ్ పీస్ మిషన్కు ఎలాంటి ఆర్థిక మద్దతు అందించలేదని స్పష్టం చేసింది.

తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ.. బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్ లో చేరేందుకు సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని.. కేవలం శాంతి పరిరక్షక దళాల్ని మాత్రమే కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లు ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ కోసం జకార్తాలో కేవలం ఎనిమిది వేల మంది శాంతి పరిరక్షక దళాల్ని మాత్రమే కేటాయించామని.. ఎలాంటి సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని స్పష్టం చేశారు.

ఎందుకు ఇలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందంటే.. ఇండోనేషియాలో ముస్లిం జనాభా అత్యధికం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక ముస్లిం ప్రజలు ఉన్న దేశం ఇండోనేషియా. ఈ దేశంలో 24 కోట్లకు పైగా ముస్లిం ప్రజలు ఉన్నారు. ఆ దేశ జనాభాలో 87 శాతం మంది ముస్లింలే. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లింలు ఉన్న దేశాలుగా పాకిస్తాన్.. భారత్.. బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ లో చేరిన వైనంపై ఇండోనేషియా ప్రజలు తమ అధ్యక్షుల వారి మీద గుర్రుగా ఉన్నారు. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేళ.. సభ్యత్వ రుసుము చెల్లించేందుకు ఆయన వెనుకాడకుండా అధికార ప్రకటన ద్వారా తేల్చేశారు. ట్రంప్ వారికి ఇది ఊహించని షాక్ గా అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో మరెన్ని షాకులు ఎదురవుతాయో?