ఇరాన్ తో వ్యాపారం చేస్తే 25%... శశిథరూర్ కీలక వ్యాఖ్యలు!
తన మాట వినని ఎవరికైనా సుంకం దెబ్బలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 15 Jan 2026 10:08 PM ISTతన మాట వినని ఎవరికైనా సుంకం దెబ్బలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దౌత్యం సంబంధాలను సుంకాల పేరు చెప్పి వార్ వన్ సైడ్ చేయడమే రెండోసారి ప్రెసిడెంట్ అయిన ట్రంప్ సరికొత్త మార్గంగా మారిన పరిస్థితి. ఈ సమయంలో తాజా పరిణామాల మధ్య ఇరాన్ తో వ్యాపారం చేసే అన్ని దేశాల పైనా 25% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. దీనిపై శశిథరూర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇరాన్ తో వ్యాపారం చేసే అన్ని దేశాల పైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికా విధిస్తోన్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
దీనివల్ల ఏ భారతీయ కంపెనీ కూడా అమెరికాకు 75 శాతం సుంకాలు చెల్లించి ఎగుమతి చేయడం సాధ్యం కాదని చెబుతూ... తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ - అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు యూఎస్ రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఇప్పటికే 50% సుంకాలు సమస్యగా ఉన్న వేళ.. మళ్లీ 25% అంటే అది కచ్చితంగా ఏ భారతీయ కంపెనీకి ప్రాక్టికల్ గా ఆచరణసాధ్యం కాదని నొక్కి చెప్పారు.
25 శాతం ఇప్పటికే సమస్య కాగా.. రష్యన్ ఆంక్షలకు మరో 25 శాతం ఎక్కువ ఉంది. అంటే... అప్పటికే సుంకాల దెబ్బ 50 శాతానికి పెరుగుతుంది. ఈ సమయంలో.. ఇరాన్ ఆంక్షలలో మరో 25 శాతం ఎక్కువ ఉంటే.. అది 75 శాతానికి పెరుగుతుందని.. ఇన్ని టారిఫ్ లను తట్టుకొని అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఆచరణీయం కాదని.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
