Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేసిన 'రప్ప.. రప్ప' ప్రచారం

పార్టీలోనూ..క్యాడర్ లోనూ ఉత్సాహాన్ని తీసుకురావటం తప్పేం కాదు కానీ.. ఆ పేరుతో ఈ రప్ప రప్ప లాంటి సినిమా డైలాగులతో ప్రచారానికి వెళ్లటం సరైన వ్యూహమేనా?

By:  Garuda Media   |   22 Nov 2025 1:00 PM IST
తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేసిన రప్ప.. రప్ప ప్రచారం
X

తగ్గేదేలే.. రప్ప రప్ప.. పుష్ప మూవీలో తెలుగునాట ప్రతి ఒక్కరికి పరిచయమైన ఈ డైలాగుల్ని శక్తి కొలదీ కొన్ని రాజకీయ పార్టీలు వాడేస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ ఫిరాయింపు కేసును ఎదుర్కొంటున్న మాజీ మంత్రి.. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. బీఆర్ఎస్ కు చెందిన అభిమానులు తమదైన శైలిలో కొంగొత్త ప్రచారానికి తెర తీశారు.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ తన పదవికి ముందుగానే రాజీనామా చేయటం పక్కా అయిన నేపథ్యంలో.. ఆర్నెల్ల వ్యవధిలో ఉపపోరు ఖాయం కానుంది. దీంతో.. ఉపపోరు ఫీవర్ పెంచే ప్రచారం అప్పుడే మొదలైంది. సోషల్ మీడియా గ్రూపుల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్పరప్ప అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోను ప్రముఖంగా.. కేటీఆర్.. హరీశ్ రావుల ఫోటోలతో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.

కొద్ది రోజుల క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడటం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన వేళ.. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్న వేళ.. జూబ్లీ ఉపపోరులో బీఆర్ఎస్ ఓటమితో డీలా పడిన క్యాడర్ కు జోష్ తెప్పించే క్రమంలో రప్ప.. రప్ప ప్రచారానికి బీఆర్ఎస్ సానుభూతిపరులు ప్రచారాన్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు.

పార్టీలోనూ..క్యాడర్ లోనూ ఉత్సాహాన్ని తీసుకురావటం తప్పేం కాదు కానీ.. ఆ పేరుతో ఈ రప్ప రప్ప లాంటి సినిమా డైలాగులతో ప్రచారానికి వెళ్లటం సరైన వ్యూహమేనా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఈ తరహా ప్రచారం కొందరిలో ఉత్సాహం తీసుకురావొచ్చు కానీ.. పలువురిని దూరం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఈ తరహా ప్రచారానికి తమ అనుమతి ఉందా? లేదా? అన్న విషయాన్ని బీఆర్ఎస్ అధినాయకత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.