Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ తో టీఆర్ఎస్ ని కొట్టడమేనా?

ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన 'టీఆర్ఎస్' అనే మూడక్షరాలు.. ఇప్పుడు ఒకే కుటుంబం మధ్య చీలికకు, ఆధిపత్య పోరుకు చిహ్నాలుగా మారడం గమనార్హం

By:  A.N.Kumar   |   25 April 2026 10:55 AM IST
టీఆర్ఎస్ తో టీఆర్ఎస్ ని కొట్టడమేనా?
X

తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అపూర్వమైన అస్తిత్వ పోరాటానికి వేదికైంది. ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన 'టీఆర్ఎస్' అనే మూడక్షరాలు.. ఇప్పుడు ఒకే కుటుంబం మధ్య చీలికకు, ఆధిపత్య పోరుకు చిహ్నాలుగా మారడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత 'టీఆర్ఎస్' పేరుతో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించడం కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు.. ఇది గులాబీ కోటలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తికి.. ఆత్మాభిమాన పోరాటానికి నిదర్శనం.

టీఆర్ఎస్‌తో టీఆర్ఎస్‌ను కొట్టాలన్న రాజకీయ వ్యూహం… తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగినట్టే కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత తాజా నిర్ణయం చూస్తుంటే “ఇంటి పార్టీతోనే ఇంటి వారిపై పోరాటం” అనే కొత్త కాన్సెప్ట్‌ను ఆమె ఆవిష్కరించినట్టుగా ఉంది.

పేరు మార్పు - ఒక చారిత్రక తప్పిదం?

తెలంగాణ రాష్ట్ర సమితిని 'భారత్ రాష్ట్ర సమితి'గా మార్చినప్పుడే ఆ పార్టీ తన మూలాలను కోల్పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ రాజకీయాల ఆశతో సొంత రాష్ట్ర అస్తిత్వాన్ని ఫణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమని విశ్లేషకులు భావించారు. నేడు అదే పేరును కవిత కైవసం చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ చేసిన ఆ చారిత్రక తప్పిదాన్ని ఆమె తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారు. కేటీఆర్ తన తప్పును దిద్దుకుని తిరిగి పాత పేరు వైపు చూస్తున్న తరుణంలోనే కవిత ముందస్తుగా ఆ పేరును రిజిస్టర్ చేయించడం 'రాజకీయ చదరంగంలో' ఆమె వేసిన తెలివైన ఎత్తుగడ.

సెంటిమెంట్ వర్సెస్ వారసత్వం

తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పేరుకు ఉన్న భావోద్వేగ అనుబంధం సామాన్యమైనది కాదు. ఆ పేరు చుట్టూ ఉన్న ఉద్యమ స్మృతులను తన వైపు తిప్పుకోవడం ద్వారా తండ్రి వారసత్వంలో తనే అసలైన వాటాదారునని కవిత సంకేతాలిస్తున్నారు. ఇది కేవలం పార్టీల మధ్య యుద్ధం కాదు.. "అసలు" , "నకలు" మధ్య జరగబోయే బ్రాండ్ బ్యాటిల్. ఓటరు తీర్పు ఇచ్చే సమయంలో ఒకే పేరుతో ఉన్న రెండు శక్తుల మధ్య గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా ఎవరికి లాభిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఆడబిడ్డ అజెండా.. సామాజిక న్యాయం

కవిత తన పార్టీ అజెండాలో మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. తనకు జరిగిన రాజకీయ అవమానాన్ని, ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను ఒక 'బాధిత మహిళా పోరాటం'గా చిత్రీకరించడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలని ఆమె భావిస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎంతో పరిణితి చెందాయి. కేవలం సెంటిమెంట్ మీదో లేదా పాత పేరు మీదో పార్టీలు మనుగడ సాగించడం కష్టం. క్షేత్రస్థాయిలో కేడర్ బలం, బలమైన నాయకత్వం లేనిదే ఏ పార్టీ అయినా మనుగడ సాగించడం సవాలే.

ఒకప్పుడు ఒకే గొడుగు కింద నడిచిన శక్తులు ఇప్పుడు రెండుగా చీలిపోయాయి. ఒకే పేరుతో రెండు కథలు వినిపిస్తున్నాయి. ఒకటి అధికార పునరుద్ధరణ కోసం ఆరాటపడుతుంటే.. మరొకటి తన ఉనికిని చాటుకోవాలని ఆకాంక్షిస్తోంది. ప్రజల నమ్మకం అనేది పేరులో ఉండదు, వారు చేసే పోరాటంలో ఉంటుంది. ఈ "లోగో యుద్ధం"లో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసం సాగే పోరు ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మేలు చేస్తుందో రాజకీయ శక్తులు ఆలోచించుకోవాలి.

తెలంగాణ ఓటరు నాడి ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. పేరు వెనుక ఉన్న వ్యక్తులా? లేక వ్యక్తుల వెనుక ఉన్న పేరులా? దేనికి పట్టం కడతారో వేచి చూడాలి.