టీఆర్‌ఎస్ పేరు కోసం రాజకీయ పోరు.. కవిత పార్టీపై బీఆర్‌ఎస్ అభ్యంతరం!
"తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆవిర్భావ పోరాటం అంతా మా అబ్బసొత్తే... కాబట్టి ‘టీఆర్ఎస్’ అనే పేరును వేరే ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు!" అంటూ బీఆర్‌ఎస్ పెద్దలు ఎన్నికల సంఘం మెట్లెక్కారు.
By: A.N.Kumar | 12 Jun 2026 12:00 AM ISTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ‘టైటిల్ వార్’ నడుస్తోంది. సినిమాల్లో టైటిల్స్ కోసం నిర్మాతలు కొట్టుకోవడం చూశాం కానీ.. రాజకీయాల్లో ఒకప్పటి ‘బ్రాండ్’ పేరు కోసం సొంత ఫ్యామిలీలోనే పంచాయితీ మొదలవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో.. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు, ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
కథలోకి వెళ్తే... దేశాన్ని ఏలేద్దామనే అత్యుత్సాహంతో 2022లో కార్పొరేట్ లుక్ ఇచ్చి 'టి'ని తీసేసి 'బి' తగిలించారు.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ పాత 'టీఆర్‌ఎస్' అనే సెంటిమెంట్ బోర్డు ఖాళీగా ఉండేసరికి దానిని దక్కించుకోవడానికి జనాలు క్యూ కట్టారు. అందులో అందరినీ షాక్‌కి గురిచేసిన ట్విస్ట్ ఏంటంటే... కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అంటూ కొత్త షాప్ ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఎన్నికల సంఘం కూడా దీనికి ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి.. అసలు సిసలు గులాబీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది.
అన్న వర్సెస్ చెల్లెమ్మ.. ‘కారు’ పోయినా ‘పేరు’ మాదే!
"తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆవిర్భావ పోరాటం అంతా మా అబ్బసొత్తే... కాబట్టి ‘టీఆర్ఎస్’ అనే పేరును వేరే ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు!" అంటూ బీఆర్‌ఎస్ పెద్దలు ఎన్నికల సంఘం మెట్లెక్కారు. సొంత చెల్లెలు పెట్టిన పార్టీ పేరుపైనే అన్న కేటీఆర్ పార్టీ అభ్యంతరం చెప్పడం చూస్తుంటే ఇంట్లోనే 'కలహాల కాపురం' నడుస్తోందని సామాన్య జనం నవ్వుకుంటున్నారు. పాత టీఆర్‌ఎస్ పేరుతో ఉన్న సెంటిమెంట్‌ను, ఓటర్లలో వచ్చే కన్ఫ్యూజన్‌ను క్యాష్ చేసుకోవాలని కవిత స్కెచ్ వేశారు. బీఆర్‌ఎస్ ఆందోళన మొదలైంది. 'కారు' గుర్తు ఎలాగో పోయింది, ఇప్పుడు ఈ 'పేరు' కూడా పోతే పాత క్యాడర్ మొత్తం చెల్లెమ్మ వైపు షిఫ్ట్ అయిపోతుందేమోనన్న భయం అన్నగారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
సోలాపూర్ లొల్లి.. ఈసీ కోర్టులో బంతి!
ఈ పంచాయితీ చాలదన్నట్టు ఎక్కడో మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ కూడా మాకూ ‘టీఆర్ఎస్’ పేరే కావాలంటూ లైన్లో నిల్చుంది. అసలు తెలంగాణకు, సోలాపూర్‌కు ఏం సంబంధం సామీ? అంటే... "బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి" అని సరిపెట్టుకోవాలి. ఇప్పటికే ఈ పేరుపై దాదాపు 700 అభ్యంతరాలు ఈసీకి చేరాయట.
రాజకీయ విశ్లేషకులు మాత్రం గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. "తెలంగాణ భావోద్వేగం ఏ ఒక్కరి సొత్తో కాదు.. మీ అవసరం కోసం పేరు మార్చేసి.. ఇప్పుడు వేరొకరు వాడుకుంటే ఏడవడం ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ‘టైటిల్’ కవితకు దక్కుతుందా? లేక బీఆర్‌ఎస్ అభ్యంతరాలకే ఈసీ ఓటేస్తుందా? అనేది చూడాలి. ఏదేమైనా గులాబీ తోటలో అంతర్గత విభేదాల ముళ్లు మాత్రం గట్టిగానే గుచ్చుకుంటున్నాయి..
