తిరుచ్చి నుంచి త్రిష...కంఫర్మ్ ?
హీరోయిన్ త్రిష ఆసక్తి సినీ రంగం నుంచి రాజకీయాల వైపు మళ్ళిందా అన్న చర్చ అయితే సాగుతోంది.
By: Satya P | 26 Oct 2026 9:20 AM ISTహీరోయిన్ త్రిష ఆసక్తి సినీ రంగం నుంచి రాజకీయాల వైపు మళ్ళిందా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి అనేక సంకేతాలు ఉన్నాయి. ఆమె సహ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం సొంత పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అదే విధంగా చూస్తే త్రిష కూడా విజయ్ పాల్గొన్న అనేక రాజకీయ వేదికల మీద కనిపిస్తూ వచ్చారు. దాంతో అప్పుడే ఆమె పొలిటికల్ ఎంట్రీ మీద ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దానికి మరింత బలం చేకూరేలా తాజాగా త్రిష కోయంబత్తూర్ వీధుల్లో చేసిన రోడ్ షో రాజకీయ వర్గాలలో హాట్ డిస్కషన్ గా మారింది.
రోడ్ షో ఎందుకు :
నిజానికి చూస్తే త్రిష కోయంబత్తూర్లో ఒక షో రూం ప్రారంభించడానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ వేలాదిగా అభిమానులు ఆమెను చూసేందుకు వచ్చారు. దాంతో ఆ ప్రాంగణం అంతా జనసమ్మర్ధం అయింది ఇక ఆమెతో ఫోటోలు తీయించుకునేందుకు వీడియోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. ఆ క్రమంలోనే త్రిష కారు బయటకు వచ్చారు. అందరికీ నమస్కరిస్తూ రోడ్ షో చేశారు. అలా ఆమె రోడ్ షో సైతం అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఆమె రోడ్ షో చేయాల్సిన పని అయితే లేదు, అభివాదం చేసి వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు ఇలా చేశారు అని అంతా చర్చిస్తున్నారు.
తిరుచ్చి ఈస్ట్ నుంచి :
ఇదిలా ఉంటే త్రిష త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. తిరుచ్చి ఈస్ట్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది. 2026 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తిరుచ్చి ఈస్ట్ తో పాటు చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు చోట్ల గెలిచిన తరువాత ఆయన తిరుచ్చి ఈస్ట్ వదులుకున్నారు. ఇక చూస్తే ఇటీవల తమిళనాడులో మదురాంతకం ధారాపురం అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో తిరుచ్చి ఈస్ట్ లేదు.
ఉప ఎన్నిక ఎందుకు జరగలేదు :
ఇక తిరుచ్చి ఈస్ట్ కి మే నెలలోనే ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ మద్రాస్ హైకోర్టులో ఈ నియోజకవర్గ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పెండింగ్లో ఉండటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉప ఎన్నికను నిర్వహించలేదు. కేవలం తిరుచ్చి ఈస్ట్ మాత్రమే కాకుండా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్న కారణంగా అంబాసముద్రం, విరాలిమలై, కరూర్, పెరుందురై స్థానాలకు కూడా ఆ విడతలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. తొందరలోనే వీటికి ఉప ఎన్నికలు ఉంటాయని అంటున్నారు.
అది జరుగుతుందా :
త్రిష రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నారా అంటే అది ఆమె బయటకు చెప్పలేదు. కానీ ఆమె జనంతో మమేకం కావడం వంటివి చూస్తే ఊహాగానాలు చేస్తున్నారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిషను పోటీ చేయిస్తారా లేదా అన్నది టీవీకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి ముఖ్యమంత్రి మనసులో ఏమి ఉందో తెలియదు అంటున్నారు. అయితే ఊహాగానాలు చూస్తే త్రిష తిరుచ్చి ఈస్ట్ అని అంతా అంటున్నారు. అదే కనుక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగం నుంచి అడుగుపెట్టే మరో హీరోయిన్ గా త్రిష ఉంటారనడంలో సందేహం లేదు.
