జయలలిత వారసురాలిగా త్రిష? సినీ గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ దిశగా సంచలన అడుగులు!
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒక భారీ ‘సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్’ను తలపిస్తున్నాయి.
By: A.N.Kumar | 18 March 2026 10:51 AM ISTతమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒక భారీ ‘సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్’ను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య సాగుతున్న ద్వంద్వ పోరాటానికి ఇప్పుడు తెరపడి.. కొత్త శక్తులు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆ పరిణామాల వెనుక నటి త్రిష పేరు ప్రముఖంగా వినిపించడం మరో ఎత్తు.
తమిళ రాజకీయాల్లో 'త్రిష' ప్రకంపనలు: కొత్త సమీకరణాలకు వేదిక?
తమిళనాడులో సినీ గ్లామర్‌కు, రాజకీయ పవర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి విజయ్ - త్రిషలపై పడింది. గత కొంతకాలంగా విజయ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం.. ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో త్రిష ఎంట్రీ వార్తలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
వివాదాలు.. విమర్శల పర్వం
ఇటీవల తమిళనాడు బీజేపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు త్రిషను నేరుగా రాజకీయ రణరంగంలోకి లాగాయి. ఆ వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించడం.. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు లభించడం చూస్తుంటే ఆమె పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ అసలైన మలుపు ఏమిటంటే విజయ్ - త్రిష ఒకే వేదికపై కనిపించడం. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కేవలం సినిమాలకే పరిమితమా లేక రాజకీయ వ్యూహాల్లో భాగమా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ నిజమేనా?
రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న అత్యంత ఆసక్తికరమైన వార్త త్రిష ఢిల్లీ పర్యటన. ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని తెలిసింది.. ఒకవేళ ఇది నిజమైతే తమిళనాడులో టీవీకే -బీజేపీ-ఏఐడీఎంకే కూటమికి త్రిష వారధిగా మారే అవకాశం ఉంది. డీఎంకేను ఢీకొట్టాలంటే బలమైన కూటమి అవసరమని భావిస్తున్న విజయ్‌కు, త్రిష ద్వారా బీజేపీతో సఖ్యత కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అన్నా డీఎంకే నేతలు కూడా త్రిషను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తర్వాతి 'అమ్మ' త్రిషనేనా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న త్రిష పాత వీడియో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులో ఆమె "భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనుంది" అని సరదాగా అన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఆమెను ఆ దిశగా నడిపిస్తాయేమో అన్న భావన కలుగుతోంది. జయలలిత లాగే త్రిష కూడా ధైర్యవంతురాలైన నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి క్షేత్రస్థాయిలో యువత మద్దతు పుష్కలంగా ఉంది. దీనికి త్రిష వంటి పాపులర్ స్టార్ తోడైతే మహిళా ఓటర్లను ఆకర్షించడం సులభమవుతుంది. ఈ పరిణామాలు అధికార డీఎంకేకు కచ్చితంగా సవాలు విసిరేవే.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ ఉత్కంఠ మరిన్ని మలుపులు తిరగడం ఖాయం. విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష కేవలం ఒక 'స్టార్ క్యాంపెయినర్'గా మిగిలిపోతారా లేక కీలక నిర్ణయాధికారిగా మారుతారా అన్నది వేచి చూడాలి.
