విజయ్ కి మద్దతుగా త్రిష.. ద్రవిడ పాలిటిక్స్ లో ట్విస్ట్
తమిళనాడు రాజకీయాలు స్టార్ యాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధానంగా దళపతి విజయ్ ఆరంగేట్రంతో తమిళ పాలిటిక్స్ లెక్కలు అన్నీ మారిపోతున్నాయి.
By: Tupaki Political Desk | 30 March 2026 11:09 PM ISTతమిళనాడు రాజకీయాలు స్టార్ యాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధానంగా దళపతి విజయ్ ఆరంగేట్రంతో తమిళ పాలిటిక్స్ లెక్కలు అన్నీ మారిపోతున్నాయి. చాలా కాలం తర్వాత ఎంజీఆర్, జయలలిత కాలం నాటి సినీ-రాజకీయ వైభవం మళ్లీ కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో టీవీకే పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఒకటి అయితే, ఆయనకు మద్దతుగా స్టార్ యాక్టర్ త్రిష రంగంలోకి దిగనున్నారని ప్రచారం మరింత ఊపు తెస్తోంది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని త్రిష ఒక పక్క చెబుతున్నా, ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారని, టీవీకే తరఫున తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని పెట్టిన దళపతి విజయ్ ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో ప్రధాన పోటీగా ఆవిర్భవించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి దీటుగా ఆయన తలపడుతున్న ప్రచారం పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఆయన ఏదో ఒక పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తారనే ప్రచారం జరిగేది. కానీ, నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఎన్నికల రేసులో ప్రధాన ప్రతిపక్షంతో సమానంగా విజయ్ నిలుస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ తరఫున త్రిష కూడా ఎన్నికల ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్-త్రిష జోడీపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విజయ్ భార్య సంగీత బహిరంగ ఆరోపణలు చేశారు. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని విజయ్ తెగేసి చెప్పడమే కాకుండా, తన భార్య ఆరోపణలు చేసిన తర్వాత త్రిషతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో విజయ్, త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో టీవీకే-బీజేపీని దగ్గర చేయడానికి త్రిష పనిచేశారని కూడా కొన్ని యూట్యూబ్ చానళ్లలో ప్రసారం చేశారు. అయితే దీనిపై త్రిష స్పందించలేదు. ఇక ఎన్నికల ప్రక్రియలో అలాంటి ఆనవాళ్లు కనిపించలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ, త్రిష మాత్రం టీవీకే తరఫున తెరవెనుక గట్టిగా పనిచేస్తున్నారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉందని చెబుతున్నారు. విజయ్ తరఫున పార్టీ నేతలతో మాట్లాడటం, ఎన్నికల వ్యూహ రచనలో త్రిష శ్రమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టారని, ఇన్నాళ్లు విజయ్ ఒక్కరే ఈ పనిచేయగా, ఇప్పుడు త్రిష కూడా భాగం కానున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది. దీంతో త్రిష ప్రచారంపై చర్చ ఉత్కంఠకు గురిచేస్తోంది.
చాలా కాలంగా దళపతి విజయ్‌తో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న త్రిష, ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయనకు మద్దతుగా నిలవనున్నారని జరుగుతున్న ప్రచారం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్‌గా త్రిష ఇచ్చే మద్దతు టీవీకే పార్టీకి యువ, మహిళా ఓటర్లలో మరింత క్రేజ్ పెంచే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై త్రిష ఇంతవరకు స్పందించలేదు. విజయ్ కూడా నోరువిప్పలేదు. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
