2028 ఒలింపిక్స్.. ట్రాన్స్ జెండర్లపై ట్రంప్ కోరిక తీరనుందా..?
నిబంధనలకు లోబడే ట్రాన్స్ జెండర్లు మహిళల విభాగంలో పోటీ పడినా అప్పట్లో ట్రంప్ ఈ అంశాన్ని పట్టుకుని తనదైన శైలిలో చెలరేగారు.
By: Tupaki Political Desk | 12 Nov 2025 2:15 AM ISTఏడాదిన్నర కిందట పారిస్ ఒలింపిక్స్...! ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు కూడా కాదు. కానీ, ట్రాన్స్ జెండర్ అంశంపై మాత్రం గట్టిగా గళం విప్పారు. ఆ సమయంలో ట్రంప్ నకు వచ్చిన ఇబ్బంది ఏమిటని పలువురు తప్పుబట్టారు కూడా..! మళ్లీ రెండేళ్లలో ఒలింపిక్స్ జరగనున్నాయి. అది కూడా అమెరికాలో. అప్పటికి అధ్యక్షుడు ట్రంప్. ఇక మరి పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వివాదం ఏమంటే... ఒలింపిక్స్ లో ట్రాన్స్ జెండర్ల అర్హత. ఇప్పటి నిబంధనల ప్రకారం ట్రాన్స్ జెండర్లు టెస్టోస్టిరాన్ స్థాయిలు పరిమితి కంటే తక్కువగా ఉన్నంత వరకు మహిళల విభాగంలో పోటీ పడవచ్చు. నిరుడు జరిగిన పారిస్ విశ్వ క్రీడల్లో అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ తో పాటు లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ)లు స్వర్ణాలు గెలుచుకున్నారు. అప్పట్లో ఇది వివాదంగా మారింది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) విచారణ మొదలుపెట్టింది.
నిప్పులు చెరిగిన ట్రంప్..
నిబంధనలకు లోబడే ట్రాన్స్ జెండర్లు మహిళల విభాగంలో పోటీ పడినా అప్పట్లో ట్రంప్ ఈ అంశాన్ని పట్టుకుని తనదైన శైలిలో చెలరేగారు. పైగా ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడు ఐవోసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. అది ట్రాన్స్ జెండర్లకు పెద్ద షాక్ ఇవ్వనుంది. అమెరికాలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కు ముందే మహిళల విభాగంలో ట్రాన్స్ జెండర్ల ప్రాతినిధ్యంపై నిషేధం విధించే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ ఇప్పటికే ట్రాన్స్ జెండర్ అథ్లెట్లకు వీసాలు ఇవ్వబోమని కూడా ప్రకటించడం గమనార్హం.
ఆ ఇద్దరి విషయంతో..
గత ఏడాది ఒలింపిక్స్ లో స్వర్ణాలు నెగ్గిన ఖలీఫ్, యుటింగ్ బాక్సర్లు. 2023లో వీరు ప్రపంచ చాంపియన్ షిప్ లలో లింగ నిర్ధారణ పరీక్షల్లో విఫలమయ్యారు. కానీ, ఒలింపిక్స్ లో పోటీకి దిగారు. అది కూడా బాక్సింగ్ లో కావడంతో ప్రత్యర్థులకు వీరికి పంచ్ ల పవర్ తేడా చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఖలీఫ్ విషయంలో. వీరు మళ్లీ పరీక్షలలో పాల్గొని అర్హత సాధించే వరకు మహిళల విభాగంలో పోటీ పడలేరు. ఈ నిర్ణయం మహిళా క్రీడా విభాగాన్ని రక్షించేందుకు అని ఐవోసీ కొత్త చీఫ్ క్రిస్టీ కోవెంట్రీ అంటున్నారు. ఒకవేళ వారిపై నిషేధమే కొనసాగితే.. ట్రంప్ తో ఇబ్బందులు కూడా ఉండవు. 2026 వింటర్ ఒలింపిక్స్ నుంచే ట్రాన్స్ జెండర్లు మహిళా విభాగంలో పోటీ పడే అంశంపై నిషేధం అమల్లోకి రావొచ్చని భావిస్తున్నారు.
